ఓటీఎస్ రిజిస్ట్రేష‌న్ల చ‌ట్ట‌బ‌ద్ద‌త ఎంత‌? ఆ డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయా?

ఏదైనా స్థ‌ల‌మో, ఇళ్లో కొనుక్కున్నారు అనుకోండి. దాన్ని ఎక్క‌డ రిజిస్ట్రేష‌న్ చేయిస్తారు? ఇది వెరీ సింపుల్ క్వ‌శ్చ‌న్‌. ఈజీగా ఆన్స‌ర్ చెప్పేయొచ్చు. ఎవ‌రైనా రిజిస్టార్ ఆఫీసులోనే క‌దా రిజిస్ట్రేష‌న్ చేయించేది అని అనుకుంటున్నారా? అయితే, మీది సగం రైట్ ఆన్స‌ర్‌.. స‌గం రాంగ్ ఆన్స‌ర్‌. ఇంత‌కుముందు అయితే మీరు చెప్పింది 100% క‌రెక్ట్ ఆన్స‌రే. కానీ, ఏపీలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం వ‌చ్చాక.. రిజిస్ట్రేష‌న్ల చ‌ట్ట‌బ‌ద్ద‌తే క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డిపోయింది. ఇళ్ల రిజిస్ట్రేష‌న్లు గ్రామ స‌చివాల‌యాల్లో కూడా చేస్తామంటున్నారు. బాండ్ పేప‌ర్ మీద కాకుండా.. వైసీపీ రంగుల ప‌త్రాల్లో కూడా డాక్యుమెంట్లు ఉంటున్నాయి. జ‌గ‌న‌న్న లీల‌లు.. ఇలా రంగు రంగుల మాయలా అనిపిస్తోంది. ఓటీఎస్ ప‌థ‌కం రిజిస్ట్రేష‌న్ల చెల్లుబాటే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌ని అంటున్నారు. 

ఓటీఎస్ పథకం ద్వారా రూ. పది, రూ. ఇరవై వేలు కడితే రూ. పది లక్షల విలువైన ఇళ్లకు హక్కులు వస్తాయని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని రూ. 8 లక్షల అప్పు వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, సబ్ రిజిస్ట్రార్లతో రిజిస్ట్రేష‌న్లు చేయించడం లేదు. గ్రామ సచివాలయాల్లోనే పంచాయతీ కార్యదర్శలు, వార్డు అడ్మిన్‌లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రభుత్వం మాత్రం వారిని తాత్కాలిక రిజిస్ట్రార్లుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసి.. పత్రాలు పంపిణీ చేస్తామంటోంది. చట్ట ప్రకారం ఇవి ఎంత వరకూ చెల్లుబాటు అవుతాయనే దానిపై స్పష్టత లేదు. 

ఇక‌, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా పార్టీ ప్రచార చిత్రాల్లా ఉన్నాయి కానీ.. అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లా లేవంటున్నారు. ఏడు పేజీలు ఉండే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు.. వైసీపీ రంగులతో ఉన్నాయి. జగన్ ఫోటో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఇలాంటి డాక్యుమెంట్ల‌కు చట్టబద్ధత ప్ర‌శ్నార్థ‌క‌మే అంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఇవి క‌చ్చితంగా చెల్లుబాటు అవుతాయ‌ని గ‌ట్టిగా చెబుతోంది. కానీ, ప్ర‌జ‌ల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అదేదో.. నిబంధనలకు అనుగుణంగా.. స్టాంప్‌ డాక్యుమెంట్లతో, సబ్ రిజిస్ట్రార్లతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తే పేదల్లో నమ్మకం ఉంటుంది అంటున్నారు. జ‌గ‌న‌న్న‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదంటున్నారు. మ‌రోవైపు టీడీపీ మాత్రం ప్ర‌జ‌లెవ‌రూ ఓటీఎస్ క‌ట్టొద్ద‌ని.. తాము అధికారంలోకి వ‌చ్చాక పేద‌లంద‌రికీ ఉచితంగా రిజిస్ట్రేష‌న్లు చేసిస్తామ‌ని ప్ర‌చారం చేస్తోంది.