జగన్ కోర్టుకు రావాల్సిందే.. హైకోర్టులో సీబీఐ స్ట్రాంగ్ వాదన..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్  వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్ పై సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది సురేంద్ర వాదనలు వినిపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ కు హాజరు మినహాయింపు ఇవ్వొద్దని ఆయన కోరారు. పిటిషన్ పై వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 

విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది పలు అంశాలు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో జగన్ ఇదే అభ్యర్థన చేస్తే సీబీఐ కోర్టు, హైకోర్టు నిరాకరించాయని తెలిపారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ అభిప్రాయపడింది. ఈ కారణంగానే గతంలో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు నిరాకరించినట్టు కోర్టుకు వివరించింది. ప్రస్తుతం జగన్ హోదా మరింత పెరిగిందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ స్పష్టం చేసింది.

పదేళ్లయినా కేసులు డిశ్చార్జి పిటిషన్ల దశలోనే ఉన్నాయని, హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని కోర్టులో సీబీఆ వాదించింది. ఈ పిటిషన్ పై పూర్తిస్థాయిలో వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ కేసులో ఏం తీర్పు రాబోతుందన్నది ఆసక్తిగా మారింది. సీఎం జగన్ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం అదేశిస్తే ఈ కేసులో కీలక పరిణామాలు జరగవచ్చని తెలుస్తోంది.