మోడీ సిగ్నల్.. టీఆర్ఎస్ ఎంపీలు జంప్!

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్కార్ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధ్వానంగా తయారైందని అన్నారు. 

పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రంగా నిరసనలు తెలుపుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఫొటోలకు పోజులు తప్ప టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో నిరసనలు తెలుపుతున్నామని చెబుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

మంగళవారం నుంచి పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు ఉండవని అన్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్  నుంచి టీఆర్ఎస్ ఎంపీలు మాయమవబోతున్నారని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సర్కారుకు ఆదేశాలు అందడమే అందుకు కారణమని చెప్పారు. వరి సాగు విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతామన్న కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.