ఉండడమ్మా..వెళ్లకండి అలా..!
posted on Oct 18, 2022 8:10AM
రెండు పిల్లి పిల్లలు ఆడుతూ రోడ్డు మీదకి వెళిపోతోంటే కుక్క వచ్చి అమాంతం నోటితో పట్టి ఇవతలకు తెచ్చి పడేసింది. అపుడు నిజానికి వాటిని రోడ్డు మీదనే వదిలేయాలి. కానీ అలా చేయలేదు. దానిలో తల్లి ప్రేమ అలా చేయనీయలేదు. వాటి పరిస్థితి దానికి అర్దమయింది గనుక తీసుకువచ్చి ఓ గోడ దగ్గర పరిచిన దుప్పటి మీద పడేసి దగ్గరికి లాక్కుంది. అలా వెళ్లకం డమ్మా..చనిపోతారు..అన్నట్టు హెచ్చరించింది. వాటి తల్లి ఎటు వెళ్లిందో, చనిపోయిందో తెలీదుగాని కుక్కకి మాత్రం అవి అనాథ లన్నది అర్ధమయింది.
అనాధపిల్లల్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది. వీరి భవిష్యత్తు ఏమవుతుందని అనుకుంటాం. చాలామంది తల్లి మనసు వ్యక్తం చేస్తారు. కొందరే ముందుకు వచ్చి సాయం చేస్తారు. పిల్లల విషయంలో సాధారణంగా కుల,మత ప్రసక్తి లేకుండా ప్రేమను ప్రదర్శిం చడం పరిపాటి. ఇది జంతువుల్లోనే ఎక్కువ. కొన్ని పక్షులు వేరే పక్షుల గూటిలో గుడ్లుపెట్టడం గురించి విన్నాం. జంతువులు తమకు అస్సలు పడని జంతువుల పిల్లల్ని సమస్యలో ఉండగా చూస్తే వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇద ప్రకృతి విచిత్రం. పిల్లంటే కుక్కకి అస్సలు పడకపోవచ్చు. కానీ పిల్లి పిల్లలు అనాధగా పడి ఉంటే కుక్క వాటిని జాగ్రత్తగా చూసుకుంటూం టుంది. ఆఖరికి పెద్ద పిల్లి వచ్చినా వాటిని వదలదేమోనన్నంతగా ప్రేమిస్తాయి, తన పిల్లలంత ప్రేమగా చూసుకుంటాయి.
దీన్ని భారత్ మాజీ క్రికెట్ స్టార్ వివి ఎస్ లక్ష్మణ్ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. తన మనోహరమైన స్ట్రోక్ ఆటకు ప్రసిద్ధి చెందిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో హత్తుకునే వీడియోను పంచుకున్నారు. తల్లి పిల్లి మరణించిన తర్వాత కుక్క పిల్లి పిల్లలను చూసుకుంటున్నట్లు వీడియో చూపిస్తుంది.
పిల్లి తల్లి మరణించిన తర్వాత పిల్లి పిల్లలను చూసుకునే కుక్క తల్లి. మాతృత్వం అనేది మరొక వ్యక్తికి సర్వస్వం కావడంలో ఉన్న సున్నితమైన అసౌకర్యం అనే క్యాప్షన్‌తో లక్ష్మణ్ వీడియోలను షేర్ చేశాడు.
సమస్త జీవరాశుల తల్లులందరికీ కృతజ్ఞతలు.