జగన్ సర్కార్ కు సుప్రీంలో మరో ఎదురుదెబ్బ
posted on Oct 18, 2022 9:47AM
కోర్టుల్లో చీవాట్లుతినడం, మొట్టికాయలు మెట్టించుకోవడం, అక్షింతలు వేయించుకోవడం ఏపీ సర్కార్ కు ఒక అలవాటుగా మారిపోయింది. జగన్ సర్కార్ కుఅడ్డగోలు నిర్ణయాలు తీసేసుకోవడం.. అవి న్యాయ పరీక్షకు నిలవకపోవడం ఒక పరిపాటిగా మారిపోయింది.
జగన్ సర్కార్ కు సుప్రీం మరోసారి గట్టిగా అక్షింతలు వేసింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) సంయుక్త కమిటీ తీర్పు మేరకు పరిహారాన్ని వెంటనే జమ చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా ఎన్జీటీ తీర్పులో చెప్పిన ప్రతి అంశాన్నీ యథాతథంగా అమలు చేయాలని విస్పష్ట తీర్పు ఇచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణఅనుమతుల ఉల్లంఘనకు ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి 250 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చిన సంగతి విదితమే.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సంగతీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం నష్టపరిహారం వెంటనే జమ చేయాలని ఆదేశించింది. నష్టపరిహారం పై తాము తదుపరి విచారణ కొనసాగిస్తామని, అది మినహా ఎన్జీటీ తీర్పులోని అన్ని అంశాలనూ యథాతథంగా అమలు చేయాల్సిందేనని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.