పాపం... 150 డాల్ఫిన్లు
posted on Apr 10, 2015 3:33PM

డాల్ఫిన్లు సంతోషంగా జీవితాన్ని గడుపుతాయి. మనుషులతో కూడా చాలా స్నేహపూర్వకంగా వుంటాయి. అలాంటి డాల్ఫిన్లు భారీ అలల కారణంగా తీరానికి కొట్టుకొచ్చాయి. జపాన్‌లోని హొకోటా నగరంలోని బీచ్ తీరానికి దాదాపు 150 డాల్ఫిన్లు కొట్టుకొచ్చాయి. ఒడ్డున అచేతనంగా పడిపోయిన డాల్ఫిన్లను తిరిగి సముద్రంలోకి పంపి వాటిని కాపాడటానికి స్థానికులు, తీర రక్షక దళ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వాటిని నీళ్లలోకి పంపేవరకూ ఎండ ధాటికి అవి ఎండిపోయి మరణించకుండా కొంతమంది వాటిని నీటితో తడుపుతున్నారు. తీరానికి కొట్టుకువచ్చిన డాల్ఫిన్లలో కొన్ని డాల్ఫిన్లు ఇప్పటికే మరణించాయని, మిగతావాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సముద్రం తీరానికి అప్పుడప్పుడు ఒకటో రెండో డాల్ఫిన్లు కొట్టుకురావడం సహజమే... అయితే ఇంత భారీ సంఖ్యలో డాల్ఫిన్లు కొట్టుకురావడం మాత్రం విచిత్రమేనని వారు అంటున్నారు.