డి.ఎల్.కు వ్యతిరేకంగా అధిష్టానానికి సిఎం నివేదికలు
posted on Mar 24, 2012 3:39PM
నిత్య అసంతృప్తుడుగా పేరు పొందిన మంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సన్నిహితులు పలు నివేదికలు పంపినట్లు తెలిసింది. ఇటీవల ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి ముఖ్యమంత్రితో పాటు మొత్తం క్యాబినెట్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా తన రాజీనామా పత్రాన్ని నేరుగా పార్టీ అధినేత సోనియాగాంధీకి పంపారు. దీంతో ఆయన వైఖరిపై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలను ఎదుర్కోకపోతే ప్రతివారు ఇలాగే ప్రవర్తించే అవకాశం ఉంటుందని భావిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి డి.ఎల్. గత చరిత్ర అంతా అధిష్టానానికి పంపారు.
గతంలో ఆయన పార్టీపైన, వై.ఎస్. రాజశేఖర రెడ్డిపైన ఇతర నాయకులపైన చేసిన ఆరోపణలను సవివరంగా పంపారు. పసలేని ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటేనని వివరించారు. గతంలో జగన్ మోహన్ రెడ్డిపై ఘోరపరాజయంపాలైన డి.ఎల్. ఎందుకు రాజీనామా చేయలేదని, ఇప్పుడు మాత్రమే ఎందుకు రాజీనామా చేశారో గమనించాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. అధిష్టానం అంగీకరిస్తే డి.ఎల్. రాజీనామా ఆమోదిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులుకూడా డి.ఎల్.పై అనేక ఆరోపణలు చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు పంపారు.