రాష్ట్ర విభజన ఒక సరి కొత్త ఆరంభమే
posted on Jul 31, 2013 9:28AM
.jpg)
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమయిన ఘట్టం మొదలయింది. తెలుగు జాతి ఒక కంట ఆనందంతో చమర్చుతుంటే, మరో కంట దుఃఖంతో కన్నీరు కారుస్తోంది. ఇదొక విచిత్రమయిన అనుభూతే. కానీ, ఒకరినొకరు ద్వేషించుకొంటూ కలిసి బ్రతకడం కంటే, విడిపోయి సఖ్యతగా ఉండటమే మేలు. విడిపోవడం వలన రెండు రాష్ట్రాలకి ఎంత నష్టము ఉంటుందో, నేతలు చిత్తశుద్ది కనబరిస్తే అంతే లాభం కూడా ఉండవచ్చును.
మద్య ప్రదేశ్ నుండి విడిపోయిన ఛత్తీస్ ఘడ్, బీహార్ నుండి విడిపోయిన జార్ఖండ్ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల వల్ల ఎటువంటి నష్టాలు, సమస్యలు ఉంటాయో సజీవ సాక్ష్యాలుగా నిలిస్తే, మహారాష్ట్ర నుండి విడిపోయిన గుజరాత్ రాజకీయ నేతలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ద్రుడసంకల్పం, చిత్తశుద్ది ఉంటే ఏవిధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోవచ్చునో చాటి చెపుతోంది. అంటే రాష్ట్ర విభజనవల్ల లాభనష్టాలు సరిసమానంగా ఉంటాయని అర్ధం అవుతోంది. ఇప్పుడు రెండుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా నేతలలో, ప్రజలలో ద్రుడసంకల్పం ఉంటే అభివ్రుద్ధిపదంలో దూసుకుపోవచ్చును. ఆ తెలివిడి, సంకల్పం లేకపోతే తిరోగమన పధంలోకి మరలినా ఆశ్చర్యం లేదు.
తెలంగాణా ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవలసిన బాధ్యత ఆ రాష్ట్ర ఏర్పాటుకి కృషి చేసిన వారిదే అవుతుంది. అదేవిధంగా ఇంతకాలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఇప్పటికయినా తాము చేసిన తప్పువల్ల జరిగిన నష్టాన్ని గ్రహించి, మున్ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా అభివృద్ధిలో ఒకదానితో మరొకటి పోటీ పడేవిధంగా తీర్చిదిద్దడం అత్యవసరం. మళ్ళీ రాజధానిని ఏర్పరిచిన ప్రాంతాన్నే అబివృద్ధి చేసుకుపోకుండా, అన్ని జిల్లాలలో అభివృద్ధి జరిగేలా ముందే ప్రణాళికలు రచించుకోవాలి.
ఇక రాష్ట్ర విభజన ఖాయం అయిపోయిన తరువాత కూడా దానిని వ్యతిరేఖించడం కంటే, రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా శ్రద్ధ చూపడం మంచిది. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకొన్నపటికీ, రెండు ప్రాంతాలకి చెందిన మేధావులు ఈ విషయంపైనే పూర్తి శ్రద్ధ చూపితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చును. తద్వారా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
గతాన్ని తలుచుకొని చింతిస్తూ, ఒకరినొకరు నిందించుకొంటూ వెనకబడిపోవడం కంటే, భవిష్యత్తుపై దృష్టి లగ్నం చేసి ఆశావహకంగా ముందుకు సాగడమే విజ్ఞుల లక్షణం. అది మన రాజకీయ నేతలకి ఉందనే ఆశిద్దాము.