అనర్హత వేటు భయం.. అసెంబ్లీకి ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు?

జగన్ పై తిరుగుబాటేనా?

వైసీపిలో తిరుగుబాటు జరగనుందా? మరీ ముఖ్యంగా ఇప్పడు వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు జగన్ ను ధిక్కరించనున్నారా?  త్వరలో అంటే ఈ నెలలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆ చర్చ జోరుగా సాగుతోంది. జగన్ ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టుపట్టి కూర్చున్నారు. హోదా ఇస్తే తప్ప తానూ, తన పార్టీ ఎమ్మెల్యేలూ అసెంబ్లీ ముఖం కూడా చూడమని తెగేసి చెబుతున్నారు. హేతురహితంగా జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ హోదా పిచ్చి కారణంగా అసెంబ్లీకి ఈ సమావేశాలకూ గైర్హాజరైతే అనర్హత వేటు తథ్యమన్న భయం వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో జగన్ ను మినహాయిస్తే.. పది మంది ఉన్నారు. వారిలో ఓ ఆరుగురు ఇటీవల రహస్యంగా సమావేశం అయ్యారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆ సందర్బంగా ప్రతిపక్ష నేత కోసం జగన్ పట్టుబట్టి ఈ సారి కూడా అసెంబ్లీకి బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకుంటే.. జగన్ ను ధిక్కరించైనా సరే అసెంబ్లీ సెషన్ కు హాజరవ్వాలని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది.  ఆ ఆరుగురు ఎవరు అన్నది అలా ఉంచితే.. జగన్ నిర్ణయాన్ని కాదని ఓ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే జగన్ కు ఉన్న అంతంత మాత్రం పరువు కూడా గంగలో కలిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఆ ఆరుగురూ జగన్ పై తిరుగుబాటు చేసైనా సరే అసెంబ్లీకి హాజరు కావాలన్న నిర్ణయానికి రావడానికి మాత్రం అనర్హత వేటు భయమేనంటున్నారు. అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వచ్చినా మళ్లీ విజయం సాధించే అవకాశాలు ఇసుమంతైనా లేవని వారు భావిస్తున్నారని చెబుతున్నారు. 

రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు ,సభకు సమాచారం ఇవ్వకుండా అరవై పని దినాలు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయవచ్చు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఒక్క రోజు హాజరు వేయించుకోవడానికి గవర్నర్ ప్రసంగానికి వచ్చారు కానీ.. అది ఉభయ సభల సంయుక్త సమావేశం కావడంతో  ఆ హాజరు చెల్లదని తేలింది.  ఆ తరువాత తర్వాత ఏదో రహస్యోద్యమంలా రహస్యంగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టేసి జారుకున్నారు. ఈ విషయం స్పీకర్ దృష్టికి రావడంతో దానిపై సీరియస్ అయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిన విషయం తన దృష్టికొచ్చిందని సభలోనే ప్రకటించి అవన్నీ దొంగ సంతకాలంటూ రూలింగ్ ఇచ్చారు. దీంతో తాము దొంగచాటుగా వెళ్లి పెట్టిన సంతకాలు కూడా చెల్లవా? ఈ సారి సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదా? అన్న భయం వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. అందుకే పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కిరించైనా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.   

అది పక్కన పెడితే స్వయంగా జగన్ కూడా అనర్హతా వేటు పడితే పులివెందుల నుంచి మరోసారి గెలిచే అవకాశాలు అంతంత మాత్రమేనని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రతిపక్ష నేత హోదానా, అనర్హత వేటా తేల్చుకోలేక సతమతమౌతున్నారంటున్నారు. ఆ కారణంగానే సజ్జల చేత ప్రెస్ మీట్ పెట్టించి మరీ అసెంబ్లీకి హాజరయ్యేదీ లేనిదీ జగన్ నిర్ణయిస్తారంటూ చెప్పించారని అంటున్నారు. 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం ఒక సభ్యుడు వరుసగా 60 రోజులు సభకు హాజరుకాకపోతే స్పీకర్ ఆ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు.  ఆ సభ్యుడు ప్రాతినిధ్యం వహించే స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభకు దూరంగా ఉంటారా? లేక  ఎమ్మెల్యే పదవిని  కాపాడుకునేందుకు మెట్టుదిగి అసెంబ్లీకి హాజరౌతారా అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.  గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా బహిష్కరించారు.  అయితే నిర్ణీత గడువు అంటే 60 పనిదినాలకు ముందుగానే.. అసెంబ్లీ గడువు తీరిపోయి ఎన్నికలు రావడంతో వారిపై అనర్హత వేటుప్రశ్నే తలెత్తలేదు. అయితే ఇప్పుడు జగన్ విషయంలో ఆ పరిస్థితి లేదు. అసెంబ్లీ గడువు ముగియడానికి ఇంకా మూడున్నరేళ్లకు పైగా సమయం ఉంది. దీంతో ఈ సారి జగన్, ఆయన పార్టీ సభ్యులు అసెంబ్లీకి డుమ్మా కొడితే.. అనర్హత వేటు ఖాయం. ఈ నేపథ్యంలోనే ఓ అరడజను మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ నిర్ణయంతో సంబంధం లేకుండానే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. 

గతంలొ మండలి సమావేశాలకు జగన్ ఆదేశాలను ధిక్కరించి మరీ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. దీంతో జగన్ తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకుని మండలిలో విపక్ష హోదా ఉంది కనుక ఎమ్మెల్సీలు హాజరౌతారని ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చింది. తనను ధిక్కరించి ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి ఉండటంతో జగన్ హోదా కంటే ప్రజా సమస్యలపై చర్చే ప్రధానం అంటూ మెట్టు దిగి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యే పదవి కోల్పోవడం కంటే.. హోదా కోసం పట్టుబట్టడం మానుకోవడమే బెటరని పార్టీ సీనియర్లు కూడా జగన్ కు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. 

మరో వైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ జగన్ కు సవాల్ విసిరారు.  ప్రతిపక్ష హోదా అన్నది ప్రభుత్వం కాదు, ప్రజలివ్వాలని కుండబద్దలు కొట్టేయడం ద్వారా హోదా ఇచ్చే ప్రశక్తే లేదని తేల్చేశారు.  దీంతో ఇక శాసనసభ సభ్యత్వాన్ని కాపాడుకోవడమా? లేదా? అన్నది తేల్చుకోవలసింది జగనే అన్న పరిస్దితి ఏర్పడింది. పరిశీలకులు మాత్రం జగన్ పట్టు వీడకుంటే.. ఆయనను ధిక్కరించైనా కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం ఖాయమని అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu