ఆర్జీవీ అరెస్టు విడుదల.. విషయమేంటంటే..?
posted on Aug 13, 2025 1:05PM

వివాదాలతో నిత్యం సహవాసం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు మంగళవారం (ఆగస్టు 12) అరెస్టు చేశారు. ఆ వెంటనే ఇద్దరు వ్యక్తుల సూరిటీతో స్టేషన్ బెయిలు ఇచ్చి విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. వైసీపీ హయాంలో రామ్ గోపాలవర్మ ఇష్టారీతిగా, అడ్డగోలుగా తెలుగుదేశం, జనసేన నేతలపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
అలాగే ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ నుచి అక్రమంగా రెండు కోట్ల రూపాయలు పొందడం సహా మరికొన్ని కేసులు కూడా రామగోపాల్ వర్మపై నమోదయ్యాయి. వాటిపై ఒంగోలు పోలీసులు రామగోపాల్ వర్మను మంగళవారం (ఆగస్టు 12) దాదాపు 11 గంటల పాటు విచారించారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు సహకరించలేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన తెలియదు, గుర్తులేదు అన్న సమాధానాలే ఇచ్చారు. అంతే కాకుండా.. తన ట్విట్టర్ అకౌంట్ ను తాను మాత్రమే కాకుండా మరికొందరు కూడా వాడారనీ, పోలిటికల్ పోస్టులన్నీ వారు పెట్టినవేననీ రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన ట్విట్టర్ అక్కౌంట్ ను వాడిన మరి కొందరి పేర్లు మాత్రం ఆయన వెల్లడించలేదని తెలిసింది.
వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అక్కౌంట్ ను వైసీపీకి కిరాయికి ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అదలా ఉంచితే.. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఇప్పటి వరకూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతాలో పోలిటికల్ పోస్టు అన్నదే కనిపించలేదు. అలాగే మీడియా, సోషల్ మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్నారు. అరెస్టు భయంతోనే ఆర్జీవీ సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇక ఒంగోలు పోలీసులు విచారణ అనంతరం రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసి ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన ఫోన్ ను సీజ్ చేశారు.