ఈడీ కార్యాలయంలో పూరి జగన్నాథ్.. డ్రగ్స్ కేసులో ఏం జరగనుందో? 

తెలుగు రాష్ట్రాల్లో సంచనం స్పష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నాలుగేండ్ల క్రితం వెలుగుచూసిన డ్రగ్స్ కేసు.. సిట్ విచారణ తర్వాత తుస్సుమంది. తాజాగా ఈడీ ఎంట్రీతో కేసులో మళ్లీ విచారణ ప్రారంభమైంది. విచారణకు రావాలని ఈడీ 12 మంది సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 22 వరకు ఈడీ విచారణ కొనసాగనున్నది. తొలి రోజు మంగళవారం నాటి విచారణకు దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు. 

ఉదయం 10.30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా... 10.05 గంటలకే  వచ్చేశారు పూరి జగన్నాథ్. ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా... పూరీ జగన్నాథ్ స్పందించలేదు. కారు దిగిన వెంటనే నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. ఈడీ సిబ్బంది ఆయనను మెట్లపై నుంచి పైకి తీసుకెళ్లారు. పూరి తో పాటు ఆయన కుమారుడు ఆకాష్,  సీఏ ( చార్టెడ్ అకౌంటెట్ )లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. మనీలాండరింగ్ తో పాటు ఇతర విషయాలపై కూడా పూరీని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించనున్నారు ఈడీ అధికారులు. డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కీలక అంశాల పై ప్రశ్నించనున్నారు. 

అక్టోబర్​ 2న చార్మీ కౌర్, 6న రకుల్​ప్రీత్​సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్​ క్లబ్​ జనరల్ మేనేజర్, 15న ముమైత్​ఖాన్, 17న తనీష్​, 20న నందు, 22న తరుణ్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. డ్రగ్స్ కొనుగోలుకు డబ్బులను అక్రమమార్గంలో విదేశాలకు తరలించినట్లు అనుమానిస్తున్న మరో 50 మందికి కూడా ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. 

మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులకు ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది.  ఈ కేసులో సిట్ బృందానికి నేతృత్వం వహించిన ఎక్సైజ్ అధికారి శీలం శ్రీనివాస్ రావు సోమవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. కేసు దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఆయన ఈడీ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది. తమ విచారణకు హాజరుకావాలని మరికొందరు ఆబ్కారీ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంలో భారీ ఎత్తున నల్లధనం చేతులు మారినట్లు వెల్లడైనా ఎందుకు నిర్లక్ష్యం వహించారన్న విషయంపై ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో  ఎక్సైజ్ అధికారులు 12 కేసులు నమోదు చేసి 11 ఛార్జీషీట్లు దాఖలు చేశారు. అయితే అందులో ఎక్కడా గతంలో విచారణను ఎదుర్కొన్న సినీతారల పేర్లు లేవు. సినీ తారలతో పాటు మొత్తం 62 మంది అనుమానితుల నుంచి వెంట్రుకలు, గోర్లు, రక్తం నమూనాలను సేకరించి ఫోరెన్సిక్​ల్యాబ్ కు పంపినప్పటికీ పరిశీలనలో ఏమి తేలిందనే విషయాన్ని ఇప్పటికీ గోప్యంగా ఉంచారు. డ్రగ్​ స్మగ్లర్లు కెల్విన్, రాఫెల్​ ఎలెక్స్​ముఠాలను అరెస్ట్​చేశారు. కానీ లోతైన దర్యాప్తు చేయకుండా చేతులు దులుపుకున్నారు. ఆ సమయంలో ఎక్త్సెజ్​ కమిషనర్ గా​ అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. ఆ తర్వాత ‘ఫోరమ్ ​ఫర్​ గుడ్​ గవర్నెన్స్ ’వంటి సంస్థల ఆందోళన,​ కోర్టు జోక్యంతో డ్రగ్స్​ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగడం ఆబ్కారీ శాఖకు సంకటంగా మారింది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu