మోపిదేవికోన్యాయం, ధర్మానికి మరో న్యాయమా ?
posted on Aug 18, 2012 9:50AM
రాష్ట్రప్రభుత్వ పరిపాలనని విశ్లేషించడం ఎవరివల్లా కాదు. ఏ విధివిధానాన్ని నమ్ముకున్నారో ఎంతకీ అంతుబట్టదు. వాన్‌పిక్ కేసులో 5వ నిందుతుడిగా సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసిందని మోపిదేవిని దగ్గరకు పిలచి బలవంతంగా రాజీనామా చేయించారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. అదే సిబిఐ 4వ ముద్దాయిగా ధర్మానపై చార్జ్ షీటు దాఖలు చేయగానే ఆయన రాజీనామా చేసినా ఆమోదం తెలుపకుండా తాత్సారం చేస్తున్నారు. ధర్మానకు మంత్రులందరూ సంఫీుభావం ప్రకటించడం, ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేకపోతున్నారు. ఈ మంత్రులే మోపిదేవినైతే పట్టించుకున్న ధాఖలాలే లేవు. ముఖ్యమంత్రి మోపిదేవికి న్యాయసహాయం అందించడానికి నిరాకరించారు.
సీనియర్ ఐఏఎస్‌లకు కూడా ఇదే పద్దతి. కొదరిని విచారణకు అనుమతించ లేదు. అయితే ఇద్దరికి మాత్రం అనుమతించారు. వారు ఇప్పటికే చెంచల్ గూడా జైల్లో ఉన్నారు. మరికొందరు త్వరలో రాబోతున్నారు. మోపిదేవి రాజీనామాతోనే మంత్రులందరూ కలసికట్టుగా తమది క్యాబినెట్ నిర్ణయమని తెలపవలసింది.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు గోల చేసి ఏం లాభమన్న విమర్శలు వస్తున్నాయి. ఏవ్యక్తి మీదో, కుటుంబం మీదో కక్ష సాధించాలనుకుంటే ఇలాగే జరుగుతుందని సి.బి.ఐ. దర్యాప్తు ప్రారంభించినప్పుడే జీవోలన్నీ క్యాబినెట్ నిర్ణయమని చెప్పుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. క్యాబినెట్ నిర్ణయాలను ఎవరూ కాదనటానికి వీలు లేదనే మంత్రి వట్టివసంతకుమార్ ఇప్పటి వరకు ఎక్కడున్నారు. సి.బి.ఐ దర్యాప్తు పేరిట ప్రభుత్వాన్ని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్న కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని నోరు తెరిచే నాయకులే కరువయ్యారన్న ఆవేదన మంత్రుల్లో వ్యక్తం అవుతోంది.