డీజిల్ భగ్గు... మిగిలింది బొగ్గు...

 

దేశవ్యాప్తంగా అనేకమంది పెట్రోలు, డీజిల్‌లను తమ ఇళ్ళలో నిల్వ చేసి అమ్ముతూ వుంటారు. ఇలా అమ్మడం చట్టప్రకారం నేరం. అంతేకాకుండా ఇలా నిల్వ చేయడం చాలా ప్రమాదకరం. ఇప్పటి వరకు ఇళ్ళలో నిల్వ చేసిన పెట్రోలు, డీజిల్ భగ్గుమనడం వల్ల ఎంతోమంది చనిపోయారు. ఈ సంగతి తెలిసినా సరే ఇలాంటి వ్యాపారాలకు పూనుకునేవారు ఎంతమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు అలాంటి సంఘటనే ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగింది. చీమకుర్తిలోని ఒక ఇంట్లో అమ్ముకోవడం కోసం చాలా డీజిల్ నిల్వ చేశారు. అయితే ఆ డీజిల్ అకస్మాత్తుగా అంటుకోవడంతో భారీ ప్రమాదం జరిగింది. డీజిల్ ఒక్కసారిగా భగ్గుమనడంతో రెండు ఇళ్ళు పూర్తిగా కాలిపోయాయి. ఆ రెండు ఇళ్ళలో వున్న గ్యాస్ సిలెండర్లు కూడా పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు డీజిల్‌కి గ్యాస్ సిలెండర్లు తోడు కావడంతో భారీ పేలుడు సంభవించింది. రెండు ఇళ్ళు క్షణాల్లో బొగ్గుగా.. నిమిషాల్లో బూడిదగా మారిపోయాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికుడు భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే ఈ సంఘటనలో ఎవరైనా చనిపోయారా అనే విషయంలో సమాచారం లేదు.