సజ్జల మెడకు కబ్జాల ఉచ్చు.. అటవీ భూముల ఆక్రమణల్లో అడ్డంగా దొరికేశారా?!
posted on Feb 20, 2025 2:42PM

వైపీపీ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా రెచ్చిపోయిన ఒక్కొక్కరికీ ఇప్పుడు చుక్కులు కనిపిస్తున్నాయి. కేసులు వెంటాడుతుండటంతో తప్పించుకునే మార్గం కనిపించక గజగజలాడుతున్నారు. అలాగే కేసులలో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరినీ అరెస్టు చేయడానిక పోలీసులు పకడ్బందీగా రంగం సిద్ధం చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన అవినీతికి హద్దే లేదన్నట్లుగా సాగింది. ఆ పార్టీ నేతలు అందినకాడికి ప్రభుత్వ భూములతోపాటు అటవీ భూములు, ప్రైవేట్ భూములను కబ్జా చేసేశారు. మరికొన్ని భూములను తక్కువ ధరకే జగన్ ప్రభుత్వం తన అనుకూల ట్రస్టులకు, కంపెనీలకు కట్టబెట్టేసింది. ఫలితంగా ప్రజలకు మేలు చేస్తారని అధికారాన్ని అప్పగిస్తే.. జగన్ మాత్రం తన హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను దోచుకోవటమే పనిగాపెట్టుకొని పాలనను గాలి కొదిలేశారు.
జగన్ మోహన్‌రెడ్డితో సహా ఆయన కేబినెట్‌లోని మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను దోచుకోవటమే పనిగా పెట్టుకున్నారు. ఐదేళ్లు మంత్రిగా కొనసాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం పెద్ద ఎత్తున భూములకు కబ్జాచేసింది. పెద్దిరెడ్డి తన సతీమణి, కుమారుడి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వందల ఎకరాల భూములను కబ్జా చేశారు. ఆయన తమ్ముడు, ఇతర కుటుంబసభ్యులు వారి అనుచరులు, బినామీల పేర్లతో దోచుకున్న భూములకు లెక్కేలేదు. విశాఖలో విజయసాయిరెడ్డి భూదందా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇలా వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల భూకబ్జాల పర్వం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగింది. దీనికితోడు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి కొందరు వైసీపీ నేతలు భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. కాకినాడ పోర్టు వేదికగా రేషన్ బియ్యాన్ని దేశం ఎల్లలు దాటించి వందల కోట్లను వైసీపీ నేతలు ఆర్జించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రేషన్ బియ్యం దోపిడీ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం పేర్ని నాని, ఆయన భార్యతోపాటు మరో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. గోదాములోని రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే పేర్ని నానిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అలాగే జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబం భూదందా వ్యవహారం సైతం వెలుగులోకి వచ్చింది.
వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏకంగా అటవీ భూమిని సజ్జల కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, జగన్ కు రైట్ హ్యాండ్ గా సజ్జల ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఏపని జరగాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఓకే చెబితేనే ఫైలు ముందుకు కదిలేది. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని సజ్జల భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. తమ భూములను కబ్జా చేశారని కూటమి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు సైతం అందాయి. దీంతో వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సజ్జల రామకృ ష్ణా రెడ్డి భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. సజ్జల బ్రదర్స్ ఏకంగా 42 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లు విమర్శలున్నాయి. అందులో పండ్లతోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అంతే కాక అటవీ భూముల్లో గెస్ట్ హౌస్‌లు, పనివారికోసం షెడ్లు కట్టించారు. అయితే, సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించినట్లు సమాచారం. వారంతా సజ్జల బినామీలేనని ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో చేసిన అక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగులోకి వచ్చాయి.
దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల బ్రదర్స్ కబ్జాల పర్వంపై సీరియస్ గా దృష్టిసారించింది. ఆ భూముల్లో అధికారులు సర్వే చేశారు. ఆ సర్వేలో సజ్జల కుటుంబం ఆక్రమణలు వాస్తవమేనని తేలింది. దీంతో సజ్జల హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తన సర్వే నివేదికను న్యాయస్థానానికి అందజేసింది. అంతే కాకుండా సజ్జల భూములపై మరోమారు సమగ్రంగా సర్వే నిర్వహించి ఆక్రమిత భూముల సరిహద్దులు గుర్తిస్తామని, రెవెన్యూ, అటవీ భూములు నిర్ధారిస్తామని తెలిపింది. న్యాయస్థానం ఇందుకు అనుమతించింది. అయితే, పంట పొలాలకు నష్టం కలగకుండా యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. దీనికి అంగీకరించిన ప్రభుత్వం తాజాగా కడప ఆర్డీవో, డీఎఫ్‌వో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమించింది. ఆ సర్వే బృందం బుధవారం (ఫిబ్రవరి 20) నుంచి సజ్జల భూముల్లో సర్వే మొదలెట్టింది.
సజ్జల ఎస్టేట్లో అటవీ భూముల కబ్జాపై ప్రభుత్వ ఆదేశాల మేరకు మరో సారి సర్వే జరుగుతోంది దీంతో ఈసారి సజ్జల కబ్జాలపై అధికారుల బృందం సునిశిత పరిశీలన చేయనుంది. అక్రమాలు తేలితే సజ్జల కటకటాలు లెక్కించక తప్పదని పరిశీలకులు అంటున్నారు.