కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగేదాకా లాగేశారా?

ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్నారు పెద్దలు.. అలాగే ఏదైనా సరే తెగేదాకా లాగకూడదనీ అన్నారు. అయితే వెంకటరెడ్డి ఆ రెంటినీ పరిధి దాటి వాడేశారా? ఇక వెంకటరెడ్డి విషయంలో కాంగ్రెస్ సీరియస్ నిర్ణయం తీసేసుకుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన క్షణం నుంచీ.. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. అంతకు ముందు నుంచీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ ను వీడతాను జగ్రత్త అంటూ అధిష్ఠానానికి ఫీలర్లు పంపుతూనే ఉన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పట్ల తన వ్యతిరేకతను ఏ మాత్రం దాచుకోకుండా రచ్చ చేస్తూనే ఉన్నారు. అధిష్ఠానం కోమటిరెడ్డి బ్రదర్స్ ను బుజ్జగించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. సరే కోమటిరెడ్డి బుజ్జగింపులను పట్టించుకోలేదు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేశారనే చెప్పాలి. టీపీసీసీ చీఫ్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ కు అంగీకరించి రేవంత్ రెడ్డి క్షమాపణ కూడా చెప్పారు. అయితే కోమటిరెడ్డి తన వైఖరి మార్చుకోలేదు. క్షమాపణలు ఎవరిక్కావాలి అంటే మళ్లీ కొత్త రాగం అందుకున్నారు. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ కు లైట్ వెలిగింది.

కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారన్నది కాంగ్రెస్ కు అర్ధమైంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వరకూ వేచి చూడాలన్న సేఫ్ గేమ్ ఆడుతున్నారని అవగతమైంది. దీంతో కాంగ్రెస్ కూడా వెంకటరెడ్డిని డ్రాపౌట్ గా పరిగణించడం ప్రారంభించింది. ఎందుకంటే వెంకటరెడ్డి మునుగోడులో సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా పని చేసేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదని తేటతెల్లమైంది. దీంతో కోమటిరెడ్డి విమర్శలు, డిమాండ్లకు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. కోమటిరెడ్డి తీరు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా లేదనీ, ఆయన వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ ను బలహీనపరచడమేననీ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

ఇక విమర్శలను ఆపేయాలనీ, సైలెంట్ గా ఉండాలనీ ఖరాఖండీగా చెప్పేసిందని పార్టీ శ్రేణులు అంటున్నారు. అంటే కోమటిరెడ్డికి పార్టీ హైకమాండ్ ఉంటే ఉండు.. లేకుంటే నీ సోదరుడి మాదిరిగానే నీ దారి నువ్వు చూసుకో అని చెప్పకనే చెప్పేసింది. మామూలుగా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పాటికే పార్టీకి రాజీనామా చేసి రాజగోపాలరెడ్డి బాట పట్టి ఉండాల్సింది. కానీ కోమటిరెడ్డికి కావలసింది అది కాదు.. పార్టీ పొమ్మనలేక పొగపెట్టినంత మాత్రాన వెళ్లడానికి సిద్ధంగా లేరు. పార్టీలో ఉంటూనే తన వ్యవహార శైలితో.. మునుగోడులో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయానికి దోహదపడే విధంగా వ్యవహరించాలి. అది భరించలేక కాంగ్రెస్ పార్టీయే తనపై చర్య తీసుకుని పార్టీ నుంచి బహిష్కరించాలి. అప్పుడే తనకు సానుభూతితో పాటు సోదరులిద్దరికీ కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న ప్రచారానికి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు.

అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గేమ్ ప్లాన్ ను పసిగట్టిన కాంగ్రెస్.. ఆయన గేమ్ ప్లాన్ కు విరుగుడు మార్గం అనుసరిస్తోంది. కోమటిరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించకుండా ఆయన నోరు అదుపు చేయాలని భావిస్తోంది. ఆయనను పొమ్మనదు.. అలాగని పార్టీలో ఆయన ఉనికిని గుర్తించదు. అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పడంతో కోమటిరెడ్డికి ఆఖరి చాన్స్ ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఆ తరువాత కూడా కోమటిరెడ్డి తీరు మారకపోవడంతో ఆయన ఉనికినే గుర్తించని విధంగా పార్టీ ముందుకు సాగాలని ఒక నిర్ణయానికి వచ్చిందని పరిశీలకలు అంటున్నారు. అందుకే ఆయన విమర్శలను, అలకలను పట్టించుకోకుండా పూర్తిగా మునుగోడు విజయం మీదే దృష్టి కేంద్రీకరించాలని పార్టీ శ్రేణులకు, రాష్ట్ర నాయకత్వం ద్వారా హై కమాండ్ విస్పష్ట ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు.