ఈటలకు గౌరవమా? కమలం అవసరమా?

బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిందనడానికి హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిదర్శనంగా నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాలలో పడుతూనో, లేస్తూనో కర్నాటకలో బీజేపీ కాలూనగలిగింది. ఆ రాష్ట్రం వినా బీజేపీకి దక్షిణాదిలో పెద్దగా పట్టు లేదనే చెప్పాలి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆ పార్టీది శబ్ద గాంభీర్యమే కానీ క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ బలం కానీ, బలగం కానీ దాదాపు శూన్యమే అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆ పార్టీ ఆశలన్నీ ఇప్పుడు తెలంగాణపైనే. ఇన్నేళ్లుగా బీజేపీలో దక్షిణాదికి పెద్దగా ప్రాధాన్యం దక్కిన దాఖలాలు లేవు. దక్షిణాది నాయకులంటే ఆ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన వాళ్లను వేళ్ల మీద లెక్కంచేంత మందే ఉంటారు. అయితే జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ అగ్రనేతల తీరు ఇప్పటి దాకా ఒకెత్తు ఇకపై ఒకెత్తు అన్నట్లుగా ఉంది. ఉత్తరాదిని ఏలేస్తున్నాం అని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిలో వేళ్లూనుకోవాలన్న ప్రయత్నాలకు ఇక్కడి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్యమైన పరిస్థితి ఎదురైంది.  అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల నేతలకూ ప్రాధాన్యత ఇచ్చారు.  జాతీయ కార్యనిర్వాహక కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు ఉంటారు. వీరిలో ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ వక్తలు, జాతీయ మోర్చా అధ్యక్షులు, స్టేట్ ప్రభారిస్, సాహ్ ప్రభారిస్, రాష్ర్ట అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఉంటారు.

ఈ కమిటీలో ఏపీ నుంచి కన్నా లక్షినారాయణ, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, జి. వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావులకు స్థానం కల్పించారు. జాతీయ ఆఫీసు బేరర్లలో తెంలగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి పురందేశ్వరికి చోటు కల్పించారు. జాతీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యకుమార్, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్ కు చోటు దక్కింది. గతంలో ఎన్నడూ తెలుగు రాష్ట్రాల నేతలకు ఈ స్థాయిలో జాతీయ కార్యవర్గంలో చోటు లభించిన దాఖలాలు లేవు. అన్నిటికీ మించి ఈటలకు పార్టీలో చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించడాన్ని ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వామపక్ష భావజాలం నేపథ్యం ఉన్న ఈటల బీజేపీలో ఇమడ లేకపోతున్నారనీ, పార్టీలో ఆయన ఉక్కపోతకు గురౌతున్నారనీ, త్వరలో పార్టీని వీడే అవకాశాలున్నాయనీ గతంలో వార్తలు వచ్చాయి.

 అయితే వాటిని ఈటల ఖండించారనుకోండి అది వేరే సంగతి. కానీ పరిశీలకులు మాత్రం ఈటల బీజేపీలో హ్యాపీగా లేరని పలు సందర్భాలలో విశ్లేషణలు చేశారు. అయితే బీజేపీలో ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని గత కొద్ది కాలంగా కమలం శ్రేణులు చెబుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈటలకు పార్టీలో చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించడం సముచిత స్థానం ఇచ్చినట్లేనా అన్న ప్రశ్న రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ గూటికి చేరే వారే తక్కువగా ఉన్నారు. ఈటల కమలం గూటికి చేరిన తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్న వారంతా ఈటలకు గతంలో సన్నిహితులే.

ఈటల వల్లే వారు కమలం గూటికి చేరారని చెప్పవచ్చు. హుజూరాబాద్ గెలుపులో బీజేపీకి ఎలా భాగస్వామ్యం లేదన్న ప్రచారం జరుగుతోందో.. ఇటీవలి కాలంలో అంటే ఈటల చేరిక తరువాత తెలంగాణలో కమలం తీర్థం పుచ్చుకున్న వారంతా ఈటల వల్లనే పార్టీలో చేరారన్న ప్రచారం జరుగుతోంది.   చివరాఖరికి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ గూటికి చేరడంలో కూడా ఈటలే కారణమని అంటున్నారు. మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకుంటున్నాయి. దీంతో బీజేపీలోకి కూడా వలసలు పెరుగుతున్నాయని చాటాల్సిన అవసరాన్ని బీజేపీ గుర్తించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్ కు ఉద్యమ కారుల్లో మంచి పట్టు ఉంది.

అలాగే టీఆర్ ఎస్ క్యాడర్ లో కూడా ఈటలకు మంచి గుర్తింపు ఉంది. ఆ కారణంగానే ఈటలకు పార్టీలో చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. ఈటలకు ఆ కమిటీ బాధ్యతలు అప్పగించడం కమలానికి అవసరం తప్ప ఆ బాధ్యతల వల్ల ఈటలకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదన్న వాదనా వినిపిస్తోంది. ఈటలకు తెలంగాణ సమాజంలో ఉన్న గుర్తింపు, పట్టును పార్టీకి ఉపయోగించుకోవాలన్న తపన, తాపత్రయం తప్ప ఈటలకు బీజేపీ ఇచ్చిన ప్రత్యేక గౌరవం ఏముందని ఆయన అభిమానులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

 ఈ విషయంలో ఈటల ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. హై కమాండ్ మెప్పుపొందేలా పార్టీలోకి చేరికలను ప్రోత్సహించి తన పట్టు పెంచుకుంటారా లేక సమన్వయ కమిటీ బాధ్యతలు తన స్థాయికి తగ్గ గుర్తింపు కాదని అసంతృప్తితో ఉదాశీనంగా ఉంటారా వేచి చూడాల్సిందే.