ధర్మాన కమిటీకి కమిట్‌మెంట్ లేదా ?
posted on Jul 16, 2012 11:02AM
ఉప ఎన్నికల్లో పరాజయానికి కారణాలు విశ్లేషించేందుకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ, కాంగ్రెస్ పార్టీకీ సమన్వయంగా వ్యవహరించేందుకు మంత్రి ధర్మానప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు అయిన మంత్రుల కమిటీ తమ మనస్సుమార్చుకుంది. ఈ కమిటీ పనితీరు బాగోలేదని సీనియర్లు, పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో తొలిసారి తమ నివేదికను ఆపేసి అసలు అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ కమిట్‌మెంట్ లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెరిగిపోయిన అవినీతి గురించి అస్సలు చర్చించలేదని ఘాటుగా కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని సాధించేందుకు ప్రభుత్వసహాయంతో ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్న బలమైన ఆరోపణ ఈ కమిటీపై వచ్చింది.
దీనికి ఎన్టీఆర్ హయాంలో రూ.1.90కే కిలో బియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దనరెడ్డి ప్రకటించిన విషయాన్ని సీనియర్లు ఉదహరించారు. అప్పట్లో రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తామన్న ఎన్టీఆర్‌నే ప్రజలు నమ్మారని వారు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల ద్వారా పార్టీ పటిష్టమవుతుందని కమిటీ అభిప్రాయపడిరది. ఇదొక్కటీ చాలదు అవినీతి కూడా తగ్గాలని పార్టీనేతలు సూచించారు. అందుకే ఈ నెల 17న ఎంపీలు, 18న ఎమ్మెల్యేలు, 19న ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించేందుకు మంత్రివర్గకమిటీ నిశ్చయించుకుంది. మంత్రి పితాని సత్యన్నారాయణ నివాసంలో సమావేశమైన ఈ కమిటీ అకస్మాత్తుగా మనస్సు మార్చుకుని తమ నివేదికను ఈ నెల 21వతేదీ వరకూ ఆపేసింది. వచ్చిన అభిప్రాయాలు క్రోడీకరించి దాని ద్వారా సరైన సమాచారం పార్టీకి, రాష్ట్రప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ ఛైర్మన్ ధర్మానప్రసాదరావు తెలిపారు.