ఓ పిల్ల దెయ్యం ఆలోచన

ఒకసారి దెయ్యాల సమావేశం జరుగుతోంది. ‘ఈ మనుషులకు మనమంటే బొత్తిగా భయం లేకుండా పోతోంది. మనం వారి మనసుని ఆవహించి, ఎంతగా చెడగొట్టాలని చూసినా వారు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు,’ అని వాపోయాడు పిశాచాల పెద్ద.

 


‘ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలి. మనదే పైచేయి కావాలి. మనుషులు పనికిరాకుండా పోవాలి,’ అని దెయ్యాలన్నీ ఏకగ్రీవంగా ఆక్రోశించాయి. ‘మన లక్ష్యం నెరవేరాలంటే ఏం చేయాలో మీరు సూచించండి,’ అని అభ్యర్థించాడు పిశాచాల పెద్ద.


‘నేను ద్వేషానికి ప్రతిరూపాన్ని,’ అంటూ లేచి నిలబడిందో దెయ్యం. ‘నా ద్వేషాన్ని జనం గుండెల్లోకి నింపుతాను. పగతో ఒకరికొకరు పొడుచుకునేలా చేస్తాను,’ అని చెప్పుకొచ్చింది.


‘నేను అత్యాశకు ఆయువుపట్టుని,’ అంటూ ముందుకి వచ్చిందో దెయ్యం. ‘నేను జనంలో లేనిపోని కోరికలను రెచ్చగొడతాను. ఆ ఆశల వెంట పరుగులెత్తలేక వారి జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి,’ అని చెప్పుకొచ్చింది.


‘నేను వ్యసనాల పుట్టని,’ అంటూ ఎగిరిదూకిందో దెయ్యం. ‘నా ప్రభావంతో మనుషులంతా వ్యసనాలలో మునిగితేలుతూ వారి మనసు, శరీరం ఎందుకూ పనికిరాకుండా పోయేట్లు చేస్తాను,’ అని గర్జించింది.


ఇలా ఒక దాని తరువాత ఒక దెయ్యం ముందుకు వచ్చి తమ తమ ప్రతిభను వెల్లడించడం మొదలుపెట్టాయి. కానీ పిశాచాల పెద్దకి ఆ సలహాలేవీ నచ్చలేదు. ‘ప్చ్‌! మనుషులు శాశ్వతంగా తరతరాలుగా పనికిరాకుండా పోయేలా మరో ఉపాయం ఏదీ లేదా!’ అని సభలోకి నిరాశగా చూశాడు.

 


‘నా దగ్గర ఓ మార్గం ఉంది,’ అందో పిల్లదెయ్యం. ‘మనుషులు ఎప్పుడు మంచిపనిని తలపెట్టాలని చూసినా, వాటిని నేను ప్రోత్సహిస్తాను. నువ్వు చేయగలవు అన్న నమ్మకాన్ని వారిలో కలిగిస్తాను. ఎలాంటి లక్ష్యాన్నయినా చేరుకునే సామర్థ్యం నీకుంది అన్న నమ్మకాన్ని రగిలిస్తాను,’ అంది.


పిల్లదెయ్యం మాటలకి పిశాచాల పెద్దకి ఒళ్లు మండిపోయింది. ‘నేను అడిగిందేమిటి, నువ్వు చెబుతోందేమిటి. పిల్లకుంకా!’ అంటూ కసురుకున్నాడు.

 


‘ఆగండాగండి. నా మాటలు పూర్తిగా వినండి. నేను మనుషులను ప్రోత్సహిస్తాను. కానీ వెనువెంటనే వారితో మరో మాట కూడా అంటాను. ‘అప్పుడే తొందరేమొచ్చింది? రేపటి నుంచి మీ పనిని మొదలుపెట్టండి’ అని సూచిస్తాను. ఒకటి రెండు రోజులు పోతే పరిస్థితులు ఇంకా మారతాయని ఊరిస్తాను. ఆ రేపు అనేది ఎప్పటికీ రాదని పాపం వారికి తెలియదు. పరిస్థితులు ఎప్పుడూ మన చేతులో ఉండవని వారు ఎన్నటికీ గ్రహించరు. మనసులో ఎన్ని ఆశయాలున్నా వాటిని నిదానంగా నెరవేరుద్దామనే భ్రమలో ఉండిపోతారు. ఆ భ్రమలోనే జీవితాలను నిరర్థకంగా గడిపేస్తారు,’ అని పిల్ల దెయ్యం ముగించగానే సభా ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. పిశాచాల పెద్ద కళ్ల వెంబడి ఆనందభాష్పాలు వచ్చాయి. అప్పటి నుంచీ పిల్లదెయ్యం తన పనిలో నిమగ్నమైపోయి ఉంది. మరి ఆ పిల్ల దెయ్యం మాటలను మీరు కూడా వింటున్నారా!!!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

 

- నిర్జర.