గన్నవరానికి నెహ్రూ?

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) విజయవాడ తూర్పు నియోజకవర్గానికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తూర్పు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవి వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేయటానికి సుముఖంగా ఉన్నారు. విజయవాడ నగరానికి దగ్గర్లో ఖాళీగా ఉన్న గన్నవరం నియోజకవర్గం నుంచి నెహ్రూను పోటీ చేయించటానికి సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం.

 

శనివారం నున్నలో విజయవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేవినేని నెహ్రూ ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. నియోజకవర్గంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలో ఉన్న ముఖ్య కాంగ్రెస్ నాయకులను కూడా నున్నలో జరిగే సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో దిక్కు లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కొండంత అండలా కనిపిస్తున్నారు.