డిప్రెషన్ వల్ల ఓ ఉపయోగం ఉంది!
posted on May 22, 2023 9:30AM
.jpg)
పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు... అంటూ మనకి ఓ వేమన పద్యం ఉంది. ఆరంభింపరు నీచ మానవులు... అంటూ భర్తృహరి సుభాషితంలో ఉన్న పద్యాన్నీ వినే ఉంటాము. ఏతావాతా తేలేదేమిటంటే- కార్యసాధకుడనేవాడు ఒక పనిని మొదలుపెట్టాక, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడడు. ఆరు నూరైనా సరే తన లక్ష్యాన్ని సాధించి తీరతాడు. ఇదంతా వినడానికి చాలా బాగుంది. పైగా భౌతిక విజయాలే కీలకమైన ఈ పోటీ ప్రపంచంలో పట్టుదల కలిగినవారిదే పైచేయి అన్న వాదనా వినిపిస్తోంది. కానీ...
డిప్రెషన్‌తో కూడా లాభం ఉంది
జర్మనీలోని ‘University of Jena’కు చెందిన సైకాలజిస్టులు డిప్రెషన్ వల్ల కూడా ఓ ప్రయోజనం ఉందని వాదిస్తున్నారు. కొంతమంది తమకు పొంతన లేని లక్ష్యాలను ఎన్నుకొని, వాటిని సాధించలేక క్రుంగుబాటుకి లోనవుతుంటారనీ... ఆ క్రుంగుబాటులోంచే వారికి తమ పొరపాటు అర్థమవుతుందనీ తేల్చి చెబుతున్నారు. తాము ఎన్నుకొన్న లక్ష్యంలోనే పొరపాటు ఉందని తేలిపోయాక, తమకు సాధ్యమయ్యే లక్ష్యాలనే ఎంచుకుంటారని అంటున్నారు. అంతేకాదు! దేని కోసం ఎంతవరకు ప్రయత్నించాలి? అనే విచక్షణ కూడా వారికి క్రుంగుబాటుతో అలవడుతుందట.
వదులుకునే విచక్షణ
తమ వాదనలో ఎంత వరకు నిజం ఉందో తేల్చుకునేందుకు సదరు సైకాలజిస్టులు ఓ పరిశోధనను చేపట్టారు. ఇందుకోసం అటు డిప్రెషన్‌తో బాధపడుతున్నవారినీ, ఇటు ఆరోగ్యంగా ఉన్నవారినీ ఎన్నుకొన్నారు. వారందరికీ కొన్ని గజిబిజి పదాలను (jumbled words) అందించారు. అంతవరకూ బాగానే ఉంది. పనిలో పనిగా కొన్ని అసాధ్యమైన పదాలను కూడా అందించారు. అంటే వాటిని ఎంతగా ప్రయత్నించినా కూడా ఒక అర్థవంతమైన పదం రాదన్నమాట! మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు జవాబు లేని పదాలను కూడా సరిచేసేందుకు పట్టువిడవకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారట. కానీ డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులు కాసేపు ప్రయత్నించిన తరువాత, ఇక తమవల్ల కాదు అన్న అనుమానం వస్తే వాటని పక్కన పెట్టేయడాన్ని గమనించారు.
పట్టువిడుపులు ఉండాలి.
పట్టివిడువరాదు అన్న సూక్తి ప్రతి సందర్భానికీ వర్తించదు అన్నది నిపుణుల మాట. మన అవకాశాలకీ, లక్ష్యానికీ మధ్య అంతులేనంత అగాధం ఉన్నప్పుడు ఒక స్థాయిలో దానిని విడిచిపెట్టేయడం మంచిదంటున్నారు. అందుకే ఈసారి ఎవరన్నా క్రుంగుబాటుతో సతమతమవుతూ ఉంటే, ముందు వారి లక్ష్యాలను కూడా విచారించాలని సూచిస్తున్నారు.
- నిర్జర.