హస్తినలో వాయుకాలుష్యం: డేంజర్ మార్క్ దాటింది.. ఢిల్లీలో గాలి విషం.!
Published on: Sat Nov 28, 2026 8:23AM
.webp)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శనివారం (నవంబర్ 28) ఉదయం గాలి నాణ్యత సూచీ 450 మార్కును దాటేసింది. నవంబర్ 21న నమోదైన 449 గరిష్ఠ స్థాయి తర్వాత ఇదే అత్యధిక తీవ్రత కావడం గమనార్హం, దీంతో హస్తిన వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని నగరంలో గాలి విషంగా మారుతోందన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
విశేషమేంటంటే.. ఒక్క రోజు ముందు అంటే శుక్రవారం (నవంబర్ 27) సాధారణ స్థాయిలో ఉన్న గాలి నాణ్యత, తెల్లవారేసరికి దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3తో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. మొత్తంగా హస్తినలో వాయు కాలుష్య తీవ్రత వెరీ పూర్ క్యాటగిరీకి చేరుకుంది. ఢిల్లీలో పీఎం 2.5 కాలుష్యానికి వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. మొత్తం పీఎం 2.5 కాలుష్యంలో వాహనాల వాటా 32 శాతంగా ఉండగా, బయోమాస్ వ్యర్థాలను కాల్చడం ద్వారా 22.8 శాతం కాలుష్యం చేరుతోంది. వీటితో పాటు ఇతర కాలుష్య కారకాలు కూడా గాలిలోని సూక్ష్మ ధూళి కణాల స్థాయిని పెంచేస్తున్నాయి.
దీనికి తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా వాయు కాలుష్యం పెరిగిపోవడానికి దోహదపడుతున్నాయి. గాలి వేగం మందగించడంతో కాలుష్య కణాలు వాతావరణంలోనే నిలిచిపోయి, నగరంపై దట్టమైన కాలుష్య పొర ఏర్పడుతోంది. దీనివల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. శీతాకాలం ప్రారంభ దశలో ఉత్తర భారతదేశంలో గాలి వేగం తగ్గడం, ఉష్ణోగ్రతల మార్పుల వల్ల కాలుష్య కారకాలు భూమి ఉపరితలానికి దగ్గరగానే పేరుకుపోవడం మామూలే కానీ, ఈ ఏడాది హస్తినలో వాయుకాలుష్య తీవ్రత ఇంత తీవ్రంగా ఉండటం ఆందోళనకరం అని వాతావరణ నిపుణులు అంటున్నారు.
.webp)
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న రెండు మూడు రోజులలో గాలి నాణత్య మరింత క్షీణించే పరిస్థితి ఉంది. వాతావరణంలో గాలి కదలికలు తక్కువగా ఉన్నంత కాలం కాలుష్య తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశాలు అంతంత మాత్రమేనని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: హమ్మయ్య హస్తినలో ఊపిరి పీల్చుకోవచ్చు: ఢిల్లీలో తగ్గిన వాయు కాలుష్యం.!
వాయు కాలుష్యం తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో, చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ లేదా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు.
.webp)
వాహన ఉద్గారాల నియంత్రణ, కాలుష్య నివారణ చర్యల అమలుపై ఢిల్లీ సర్కార్ మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితి కళ్లకు కడుతున్నది. ప్రజారోగ్యం దృష్ట్యా వాయు కాలుష్య నివారణ విషయంలో హస్తిన సర్కార్ కఠిన చర్యలకు ఉపక్రమించాలని పర్యవరణ నిపుణులు చెబుతున్నారు.
మీకు నచ్చవచ్చు: హస్తినను కమ్మేసిన వాయు కాలుష్యం
సరిగ్గా వాడితే ప్రాణవాయువు.. అతి చేస్తే కాలకూట విషం.!
[Delhi Air Pollution, AQI 454, PM pollution, Vehicle Emissions, Delhi Air Quality, TeluguOne]


