హమ్మయ్య హస్తినలో ఊపిరి పీల్చుకోవచ్చు: ఢిల్లీలో తగ్గిన వాయు కాలుష్యం.!
Published on: Wed Nov 18, 2026 11:01AM

దేశ రాజధాని నగరం ఢిల్లీ, అలాగే నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వాయుకాలుష్యం తగ్గింది. దీంతో హస్తిన వాసులకు ఉపశమనం లభించింది. హాయిగా గాలి పీల్చుకోవచ్చంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు దేశ రాజధాని ప్రజలు. ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఇతర పర్యవేక్షణ సంస్థల సమాచారం ప్రకారం, ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ 204కు పడిపోయింది. కాలుష్య స్థాయిలు కొంతవరకు మెరుగై పేలవమైన కేటగిరీకి చేరడంతో, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) మూడో దశ నిబంధనలను సీఏ క్యూయం ఎత్తివేసింది.
తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తొలగిపోవడంతో నిర్మాణ రంగ పనులు, వాహనాల రాకపోకలపై విధించిన నిషేధాలు తొలగిపోయాయి. అయితే, శీతాకాలం కొనసాగుతున్నందున కాలుష్య ముప్పు పూర్తిగా తొలగిపోలేదని ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మోడో దశనిబంధనలు తొలగించినప్పటికీ జీఆర్ఏపీ తొలి రెండు దశల ఆంక్షలు, నిబంధనలూ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

గతంలో దీపావళి పండుగ సమయంతో పాటు ఆ తర్వాతి రోజుల్లో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరింది. అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు ప్రమాదకర మార్కును దాటిపోవడంతో నగరమంతా దట్టమైన విషపూరిత ధూమపటలం అలుముకుంది. ఆ సమయంలో ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇన్ని రోజుల తరువాత వాయుకాలుష్యం ఒకింత మెరుగుపడటంతో ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: హస్తినను కమ్మేసిన వాయు కాలుష్యం
ప్రస్తుతం వాతావరణంలో కనిపిస్తున్న ఈ స్వల్ప మెరుగుదల తాత్కాలికం మాత్రమే కావచ్చని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. చలి తీవ్రత పెరిగే కొద్దీ గాలి వేగం మందగించి కాలుష్య కారకాలు మళ్లీ పేరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
.webp)
రాబోయే వారాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా మారతాయనే దానిపై అధికారులు నిరంతరం నిఘా ఉంచారు.ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు తీసుకుంటున్న చర్యలతో పాటు పౌరుల భాగస్వామ్యం కూడా కాలుష్య నియంత్రణకు ఎంతో అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు.
మీకు నచ్చవచ్చు: Air Pollution: సరిగ్గా వాడితే ప్రాణవాయువు.. అతి చేస్తే కాలకూట విషం.!
కాలుష్య భారతం: కాలుష్య నగరాల జాబితాలో ఇండియా టాప్.!
[Delhi, Airpollution, GRAP, Stage3Lifted, AQI 20, DelhiNCR,TeluguOne]


