టీడీపీ మీద కేసు పెట్టినట్టే...తెలంగాణా ఐఏఎస్ మీద కూడా కేస్ పెడతారా ?
posted on Jul 6, 2019 5:51PM

పేరు చెబితే జాతకం చెబుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణా ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ వ్యాఖ్యల మీద వివాదం ముసురుకుంటోంది. ఆయన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ స్పందించింది. ఈమేరకు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆ పార్టీ అధికార ప్రతినిది, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి దానం నాగేందర్ చేతిలో ఓటమి పాలయిన దాసోజు శ్రవణ్.
ప్రజల వ్యక్తిగత సమాచారం చిటికెలో చూస్తామని, ఇస్తామని ఐటి సెక్రటరీ చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రజల అనుమతి లేకుండా సమాచారం సేకరించారు? ఎలాంటి వివరాలు ప్రభుత్వం సేకరించింది? అందుకు పౌరుల అనుమతి ఉందా? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల సమాచారం చోరీ చేసిందని పేర్కొంటూ ఐటీ గ్రిడ్ వ్యవహారంలో పక్క రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు పెట్టిన సంగతిని గుర్తు చేసిన ఆయన ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ మీద కేసు ఎప్పుడు పెడుతున్నారని ప్రశ్నించారు.
ప్రజల డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను టీడీపీ ఒక ఆయుధంలా వాడుకోవచ్చు. నిజంగా అంతదాకా వస్తే నిన్న వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి అదేదో ఉత్సాహ పరచడానికి చెప్పిన విషయమే, అలాంటిది ఏమీ లేదని కూడా చెప్పే అవకాశం ఉంది. అయిన రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా చెప్పండి ?