మీకు చేతకాకపోతే చెప్పండి నేనే రంగంలోకి దిగుతా: అమిత్ షా
posted on Jul 6, 2019 6:24PM

తెలంగాణ లో బీజేపీని విస్తరించి 2023 లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ లో అధికారం లోకి రావాలని మోడీ అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో బీజేపీ సభ్యత్వ నమోదు పై రాష్ట్ర స్థాయి నేతలకు దిశా నిర్దేశం చేయడానికి అమిత్ షా ఈ రోజు హైదరాబద్ వచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికలలో తెలంగాణలో బీజేపీకి 19 శాతం ఓట్లు వచ్చాయని.. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కొద్ది సేపటి క్రితం శంషాబాద్ శివారులోని రంగనాయకతండాలో పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అయన ప్రారంభించారు. సోనీబాయి అనే గిరిజన మహిళ కుటుంబానికి తోలి సభ్యత్వాన్ని ఇచ్చి వారి ఇంట్లో జొన్నరొట్టె తిని, టీ తాగారు. అనంతరం శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నాయకత్వానికి భారీ టార్గెట్ ఇచ్చారు. కనీసం 20లక్షల మందిని బీజేపీ సభ్యులుగా చేర్చాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర నాయకత్వం 12 లక్షల మంది కార్యకర్తలను పార్టీలో చేర్చడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే అమిత్ షా ఏకంగా 20 లక్షల టార్గెట్‌ను చేరుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్ర నేతలకు కనుక చేతకాకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని చెప్పారు. ప్రతి జిల్లాలో పర్యటించి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తానని అయన ఈ సందర్బంగా చెప్పారు.