మొన్న దాడి, ఇప్పుడు చీక‌ట్లు.. చంద్ర‌బాబు టార్గెట్‌గా ఏదో జ‌రుగుతోందా?

చంద్ర‌బాబు మామూలు స్థాయి నేత కాదు. మూడుసార్లు ముఖ్య‌మంత్రి. గ‌తంలో న‌క్స‌ల్స్ అటాక్ కూడా జ‌రిగింది. అందుకే, దేశంలోకే అత్యున్న‌తమైన బ్లాక్ క్యాట్ క‌మెండోల‌ ర‌క్ష‌ణ‌, జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ఉంది. అలాంటి నాయ‌కుడి టార్గెట్‌గా ఏదో జ‌రుగుతోంద‌నే అనుమానం. వ‌రుస ఘ‌ట‌న‌లు అందుకు మ‌రింత బ‌లాన్ని ఇస్తున్నాయి. ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ వంద‌లాది మందిని వెంటేసుకొని, క‌ర్ర‌లు, రాళ్ల‌తో వెళ్లి.. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటిపై అటాక్ చేశారు. ఆ ఘ‌ట‌న‌ తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. అది మ‌రువ‌క ముందే.. తాజాగా చంద్ర‌బాబు ఇంటి చుట్టూ చిమ్మ చీక‌ట్లు అలుముకున్నాయి. ఆయ‌న ఇంటికి క‌రెంట్ ఉన్నా.. ఆ నివాసానికి దారి తీసే అన్నిమార్గాల్లో చీక‌ట్లే క‌మ్ముకున్నాయి. ఇది యాదృచ్చికంగా జ‌రిగిందా? లేక‌, ఉద్దేశ్య‌పూర్వ‌కంగా ఇలా చేస్తున్నారా? అనే అనుమానం టీడీపీ శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నాయి. అస‌లేం జ‌రిగిందంటే....  

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. ఆ ఇంటికి సమీపంలోని మార్గంలో చాలా వరకు వీధి దీపాలు వెలగడం లేదు. చంద్రబాబు ఇల్లు తాడేపల్లిలోని కట్ట దారికి వంద అడుగుల దూరంలో నది వైపు ఉంది. సుమారు 2 కిలోమీటర్ల పొడఉండే కట్ట దారిలో కొండవీటి వాగు దాటాక కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతుండ‌టాన్ని ఎలా చూడాలి? జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ ఉన్న నాయ‌కుడి ఇంటి చుట్టు ప‌రిస‌రాలు ఇంత చీక‌టిగా ఉంటే.. ఇక ర‌క్ష‌ణ ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తున్నారు. 

చంద్రబాబు ఇంటి సమీపంలో నాలుగు రోజులుగా ఒక్క లైటూ వెలగడం లేదు. భద్రత సిబ్బంది సైతం చీకట్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న నాయకుడి ఇంటి ద‌గ్గ‌ర‌ పరిస్థితి ఇలా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కట్ట దారిలో మూడు అంచెలుగా ఉన్న చెక్‌పోస్టుల్లోని సిబ్బందిని ప్రశ్నిస్తే.. ‘పై అధికారులకు చెప్పాం.. వాళ్లు పట్టించుకోవడం లేదు’ అని సమాధానం ఇచ్చారు. 

మామూలుగా అయితే ఏ ప‌ట్ట‌ణంలో స్ట్రీట్ లైట్స్ వెల‌గ‌కున్నా.. అధికారులకు ఫిర్యాదు చేస్తే దాదాపు వెంట‌నే స‌రి చేస్తారు. అలాంటిది చంద్ర‌బాబు ఇంటి ద‌గ్గ‌ర నాలుగు రోజులుగా వీధి లైట్లు వెల‌గ‌క‌పోవ‌డం..    భ‌ద్ర‌తా సిబ్బంది చెప్పినా.. ఆ విష‌యం ప‌ట్టించుకోక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. కావాల‌నే ఇలా చేస్తున్నారా? చంద్ర‌బాబును ఇబ్బంది పెట్ట‌డం కోసం ఆయ‌న భ‌ద్ర‌త‌ను ప‌ణంగా పెడుతున్నారా?  చంద్ర‌బాబు ఇంటి చుట్టూ చీక‌ట్ల‌కు ఎవ‌రు బాధ్యులు?