అప్పుల్లో దేశంలోనే ఏపీ ఫస్ట్.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు మ‌రో రికార్డ్‌..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోమారు అగ్రగామిగా నిలిపారు. నిజమే, జగన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచే, ఏ.. అంటే అప్పులు, పీ ..అంటే పంపకాలు అనే అర్ధంలోనే ఏపీలో పరిపాలన సాగుతోంది. అందినకాడికి అప్పులు చేయాలి... తెచ్చిన అప్పును తెచ్చినట్టుగా ఏదో ఒక పథకం పేరిట ప్రజల ఖాతాలలో వేసేయాలి .. ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలి ఇదే, జగన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సూత్రం. 

నిజమే. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యాలలో ఒకటి, అందులో సందేహం లేదు. అయితే, గీత దాటి, అభివృద్ధిని ఆవలకు నెట్టేసి, కేవలం సంక్షేమం పైనే దృష్టిని నిలపడం సరైన విధానం కాదు, అందుకే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా అంచుకు చేరిందని, విపక్షాలే కాదు, ఆర్థిక నిపుణులు కూడా చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు.అయినా,జగన్ రెడ్డి ప్రభుత్వం హెచ్చరికలను పెడ చెవిన పెట్టింది. 

అప్పులు, పంప‌కాలు పాలసీని అలాగే కొనసాగిస్తోంది. ఫలితంగా ఇప్పటికే అనేకసార్లు జగన్ రెడ్డి ప్రభుత్వం నెత్తిన అక్షింతలు వేసిన కాగ్’ ఇప్పుడు మరో మారు అదే పనిచేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో అగ్ర స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఉండడం ఒక్కటే కాదు, బడ్జెట్’లో ప్రతిపాదించిన వార్షిక అప్పు మొత్తాన్ని, మొదటి నాలుగు నెలల్లోనే సేకరించింది. సేకరించిన మొతాన్ని అంతే వేగంగా ఖర్చు చేసింది. ఇది ఒక విధంగా ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన డబుల్ ధమాకా అచీవ్‌మెంట్ కావచ్చు. 

దేశంలో ఇన్నిరాష్ట్రలున్నా ఏ రాష్ట్రం కూడా నాలుగే నాలుగు నెలల్లో సంవత్సర ఖాతాలోంచి, 97 శాతానికి పైగా అప్పు చేయలేదు. ఒక్క జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే, నాలుగే నెలల్లో 97.68 శాతం అప్పు చేసింది. అంటే మిగిలిన ఎనిమిది నెలల కాలానికి చేయగల అప్పు, నిండా మూడు శాతం కూడా లేదు. పోనీ ఇలా అప్పు చేసిన సొమ్మును సద్వినియోగం చేసిందా అంటే, అదీ లేదు. పప్పు బెల్లాల్లా పంచేసిందని, మాజీ ఆర్థిక మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామ కృష్ణుడు, అదే విధంగా ఆర్థిక రంగ నిపుణులు చెపుతున్నారు. అందుకే ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో సంక్షేమానికి కోతలు పెడుతోంది.

అదలా ఉంటే, కాగ్’ నివేదిక విడుదల చేసిన వివరాల ప్రకారం, మిజోరం (82.87 శాతం), కేరళ (73.78 శాతం) మినహా మిగిలిన ఏ రాష్ట్రం కూడా అప్పులు చేయడంలో ఏపీకి సమీపంలో కూడా లేవు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్, వార్షిక రుణ పరిమితిలో నాలుగు నెలల్లో కేవలం 21.07 శాతం మాత్రమే వినియోగించుకుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ 32.89 శాతం మాత్రమే వినియోగించుకుంది. ఏపీ అందుకు మూడు రెట్లు ఎక్కువ అప్పు చేసింది.  

అప్పులు చేయడంలోనే కాదు, అప్పులను ఖర్చు చేయడంలోనూ ఏపీ ఫస్ట్ ప్లేస్’ లో ఉంది. బడ్జెట్’లో ప్రతిపాదించిన వార్షిక వ్యయంలో నాలుగు నెలల్లో  36 శాతం ఖర్చు చేసి ఖర్చుచేసింది. అయితే, దేనిపై ఖర్చు చేసింది, అనేదే కీలక ప్రశ్న. అనుత్పాదక వ్యయం చేయడం వల్లనే అప్పుల భారం పెరిగిపోతోందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, అప్పులు, పంపకాలు పాలసీనే ఫాలో అవుతోంది. అందుకే చివరకు ఎపీకి మిగిలేది..అప్పులు,తిప్పలు.చిప్పలు మాత్రమే అంటున్నారు ఆర్థిక నిపుణులు.