టాప్ న్యూస్ @ 8 PM

27న రైతు సంఘాల భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతుల ప్రయోజనాలే టీడీపీకి ప్రధానమని వ్యాఖ్యానించారు. బంద్‌లో టీడీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సచివాలయాలను సందర్శిస్తానన్న సీఎం జగన్‌ దమ్ముంటే రైతులతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. 
-------
ఏపీ కేబినెట్ విస్తరణ అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ లో 100 శాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని బాలినేని వెల్లడించారు. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ తన మంత్రి పదవి పోయినా బాధపడనని, సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
------
టీడీపీ, జనసేన పొత్తుతో సంచలన విజయం ఖాయమని టీడీపీ మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు స్పష్టం చేశారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని రాజోలు, మలికిపురం మండల పరిషత్ విజయమే నిదర్శనమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు సాగిస్తున్న వైసీపీకి చరమగీతం పాడాలంటే జనసేన టీడీపీలు చారిత్రక పొత్తు అవసరం తప్పనిసరన్నారు. రెండు పార్టీల అధినేతలు కూడా ఒకసారి ఆలోచన చేసే దిశగా అడుగులు పడాలని సూచించారు. 
-------
కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగ రాష్ట్రానికి సంబంధించి తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, తదితర అంశాలను సీఎం కేసీఆర్‌ చర్చించారు. సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, రాజేందర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.
-------
బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే సిలిండర్‌ ధర మూడు వేలు పెంచి.. మనవద్ద నుంచే వసూల్‌ చేస్తారని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని, మంచి నూనె ధర 300 రూపాయలకు పెంచుతారన్నారు.  పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. 
---------
ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య వివాదం ముగిసింది. ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శలు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ జగ్గారెడ్డికి సర్దిచెప్పారు. శుక్రవారం ఘటనపై జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడటంపై జగ్గారెడ్డి సారీ చెప్పారు. ‘‘నిన్నటి ఘటనను మరిచిపొండి. అంతర్గత విషయాలు బయట మాట్లాడటం నా తప్పే. నా వైపు నుంచి తప్పు జరిగింది.. మరోసారి అలా జరగదని వివరణ ఇచ్చారు.
----
దీపావళి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే మిలియన్ మార్చ్ చేస్తామని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు సంజయ్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్లలో సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. కరీంనగర్‌లో హిందూవులను బొందుగాళ్ళు అంటే కేసీఆర్‌ను బొంద పెట్టామని ఆయన పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ల దందా చేసి కేసీఆర్ చాలా మందిని మోసం చేసిండని ఆయన ఆరోపించారు. 
-------
గులాబ్ తుపాను ఆదివారం  సాయంత్రం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలను తాకనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని అధికారులు తెలిపారు. రాగల 12 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని పేర్కొన్నారు. అనంతరం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా-విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం వద్ద ఆదివారం సాయంత్రం తీరం దాటుతుందని వివరించారు. 
-----
శ్రీశైలంలో సామాన్య భక్తుడికి దేవస్థానంమల్లికార్జునస్వామి స్పర్శదర్శన భాగ్యం కల్పించింది. ప్రతిరోజు రాత్రి 9 నుండి 10 గంటల వరకు సామాన్య భక్తులకు అనుమతి కల్పించారు. రాత్రి 7:30 నుండి ఆర్జితసేవ కౌంటర్స్‌లో భక్తులకు 500 విరామ దర్శనం టికెట్ అందుబాటులో ఉంచుతామని ఈవో తెలిపారు. ఇప్పటి వరకు విరామ దర్శనానికి లెటర్ ప్యాడ్‌పై టికెట్స్ ఇచ్చామన్నారు. ఇకపై సామాన్యుభక్తుడికి అందుబాటులో స్పర్శదర్శనం టికెట్లు అందుబాటులు ఉంటాయన్నారు.
------
భారత దేశ ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని వివరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను తాను ఉదాహరణగా చెప్పుకున్నారు. టీ స్టాల్‌లో తండ్రికి సాయపడిన బాలుడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ (యూఎన్‌జీఏ)లో మాట్లాడటం నాలుగోసారి అని చెప్పారు. న్యూయార్క్‌లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 76వ యూఎన్‌జీఏ సెషన్‌ను ఉద్దేశించి మోదీ శనివారం మాట్లాడారు. 
--------
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల నిజస్వరూపం బట్టబయలవుతోంది. తాజాగా హెరాత్ నగరంలో ఓ మృతదేహాన్ని క్రేన్ కు వేళ్లాడదీసి ప్రదర్శించారు. హెరాత్ లోని ప్రధాన కూడలిలో తాలిబన్ల చర్యతో ఆఫ్ఘన్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హెరాత్ నగరంలోని వజీర్ అహ్మద్ సిద్ధిఖీ అనే ఫార్మసీ యజమాని ఈ ఘటనను ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు.
---