అప్పుడు గజదొంగ..ఇప్పుడు కాదు
posted on May 4, 2013 2:01PM
.jpg)
నిన్న మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డి ఒక గజదొంగ అని, ఆయన పార్టీని ఒక దొంగల ముటా అని మీడియా ముందు తిట్టిపోసిన దాడి వీరభద్రరావుకి, అలనాడు భోది వృక్షం క్రింద బుద్దుడికి జ్ఞానోదయం అయినట్లు, నేడు చంచల్ గూడా జైల్లో జ్ఞానోదయం అయింది. ఈ రోజు జైల్లో జగన్ మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ “నేను గతంలో విన్న జగన్ వేరు, నేడు నేను చూసిన జగన్ వేరు. ఆయన గురించి బయట చాల చెడుగా ప్రచారం అవుతోంది. కానీ, ఆయన జైల్లో ఉన్నాకూడా రాష్ట్రం బాగుడాలనే తపిస్తున్నారు. అటువంటి ధృడ సంకల్పం కలిగిన నేతను ఇటీవల కాలంలో నేను చూడలేదు. ఆయన నేతృత్వంలో నేను పని చేయాలని నిశ్చయించుకొన్నాను. గతంలో నేను వారి గురించి, వారి పార్టీ గురించి చేసిన విమర్శలు తెదేపా విధానాలననుసరించి చేసినవే తప్ప వ్యక్తిగతంగా చేసినవి కావు. ఆయన కుటుంబానికి చాలా అన్యాయం జరుగుతోంది. వారికి అండగా నిలబడతాను,” అని అన్నారు. ఆయన వైకాపాలో చేరుతున్నానని చేసిన ఈ ప్రకటనతో, తనకు, తన కుమారుడు రత్నాకర్ కు పార్టీ టికెట్స్ ఖాయం చేసుకొన్నట్లే భావించవలసి ఉంటుంది. మరి దీనికి కొణతాల సోదరులు ఏవిధంగా స్వీకరిస్తారో చూడాలి. తనకి పదవులు ముఖ్యం కాదంటూనే, శాసన మండలికి రెండవసారి అవకాశం ఇవ్వనందుకు తెదేపాతో 30ఏళ్ల తన అనుబంధాన్ని పుటుకున్న తెంచేసుకొన్న ఇటువంటి వ్యక్తి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదో ఒకరోజు హ్యాండిచ్చి వేరే పార్టీలోకి మారడని ఖచ్చితంగా చెప్పలేము. ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నఅనకాపల్లి వైకాపా కార్యకర్తలు, నేతలతో పొసగక బహుశః వచ్చే ఎన్నికలలోగానే ఆయన మళ్ళీ పార్టీ మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.