టీఆర్ఎస్ కి షాక్... పార్లమెంటరీ సమావేశానికి వచ్చిన డీఎస్

 

మాజీ పీసీసీ అధ్యక్ష్యుడు టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ ఈరోజు ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పార్టీ ఎంపీ ఆ పార్టీ మీటింగ్ కి వస్తే ఆశ్చర్యం ఏముంది అని అనుకోవచ్చు ! కానీ ఆయన చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని డిఎస్‌పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఆయనపై కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు ఆయన కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, కేసీఆర్ మాత్రం ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీన్తి ఆయన తను ఏదైనా తప్పు చేస్తే తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ, ఆయనపై పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయినా అప్పటి నుండీ పార్టీకి దూరంగా ఉంటూనే వచ్చారు. ఈ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డిఎస్ తనయుడు అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి కవితపై  విజయం సాధించారు. అరవింద్  గెలుపు వెనుక డిఎస్ కీలకంగా వ్యవహరించారని ఎన్నికల సమయంలో తన పాత పరిచయాలను డిఎస్ వినియోగించుకొని కొడుకు విజయం కోసం పనిచేశారనే ప్రచారం కూడ సాగింది. 

ఈ ఎన్నికల్లో  బీజేపీ గెలుపు కోసం  పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడ సహకరించిందని కూడా ఇంటలిజెన్స్ కి సమాచారం. అలాంటి శ్రీనివాస్ ఈరోజు జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డిఎస్ హాజరుకావడం మాత్రం రాజకీయ వర్గాల్లో  ఆసక్తిని కల్గిస్తోంది. నిజానికి నిబంధనల ప్రకారండీఎస్‌పై అనర్హతా వేటు వేయడానికి ఆయన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలకు రాకపోవడాన్ని ఓ కారణంగా చూపించాలనుకున్నట్లు తెలిసినందునే డీఎస్ ఈ మీటింగ్ కు హాజరయ్యారని అంటున్నారు.