టీ @ ₹1,000.. హైదరాబాద్‌లో ఇస్పెష‌ల్ కాస్ట్లీ చాయ్‌..

అరే చిన్నా.. ఏక్ ఛాయ్‌.. అని ఆర్డ‌ర్ వేసి.. పొగ‌లు క‌క్కే వేడివేడి హైద‌రాబాదీ ఇరానీ ధ‌మ్ చాయ్ తాగుతుంటే ఆ మ‌జానే వేరు.. పాణం గాల్లో తేలిన‌ట్టుంటుంది. ఆంధ్ర‌లో డికాష‌న్ టీ ఎలా ఫేమ‌స్సో.. హైద‌రాబాద్‌లో ధ‌మ్ చాయ్ ఫుల్ పాపుల‌ర్‌. ఇరానీ కేఫ్‌లో అయితే క‌ప్పు టీ రూ.20 ఉంటుంది. రోడ్డు ప‌క్క‌న బండ్ల మీదైతే.. రూ.10-15కు అమ్ముతుంటారు. ధ‌ర కాస్త అటూఇటూ ఉన్నా.. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అందుకే, హైద‌రాబాద్‌లో ప‌నిమీద బ‌య‌ట తిరిగే వారు.. రోజంతా చాయ్ తాగుతూ రిఫ్రెష్ అవుతుంటారు. సిప్పు సిప్పుకూ ఉత్తేజం పొందుతుంటారు. ఇదంతా కామ‌న్ చాయ్ గురించి. కానీ, హైద‌రాబాద్‌లోని ఓ కేఫ్‌లో లేటెస్ట్‌గా ఓ ఇస్పెష‌ల్ చాయ్ వ‌చ్చింది. ఆ టీ.. అలాంటి ఇలాంటి టీ కాదు మ‌రి. ఇండియాలోనే వెరీ వెరీ స్పెష‌ల్‌. అందుకే, ఆ అదురైన‌ చాయ్‌కి రుచితో పాటు ధ‌ర కూడా అదిరిపోతోంది. రేటెంతో తెలుసా.. క‌ప్పు టీ.. వెయ్యి రూపాయ‌లు. ట్యాక్స్‌లు అద‌నం. 

నీలోఫర్‌ కేఫ్.. హైదరాబాద్‌లో వెరీ పాపుల‌ర్‌. అనేక రకాల టీలు, బిస్కెట్స్‌ను అమ్ముతుంటారు. తాజాగా, బంజారాహిల్స్‌లోని నీలోఫ‌ర్‌ కేఫ్‌ బ్రాంచ్‌లో ప్రత్యేకమైన, ఖరీదైన టీని పరిచయం చేస్తున్నారు. ఈ టీని గోల్డెన్‌ టిప్స్‌ బ్లాక్‌ టీ పౌడర్‌తో తయారు చేస్తారట. అందుకే ఆ చాయ్ టేస్ట్ అద్భుతః అనిపిస్తుంద‌ని చెబుతున్నారు. 

ఆ ప్ర‌త్యేక‌మైన‌ టీ పౌడర్‌ను కేఫ్‌ యాజమాన్యం వేలంలో గెలుచుకుంది. అసోంలో నిర్వహించిన వేలంలో కేజీ రూ.75వేలకు కొనుగోలు చేశారు. అందుకే, ఆ టీ పౌడ‌ర్‌తో చేసే టీకి అంత ఖ‌రీదు. ప్రస్తుతం నీలోఫ‌ర్ కేఫ్‌లో కేవ‌లం కేజీన్నర గోల్డెన్‌ టిప్స్‌ బ్లాక్‌ టీ పౌడర్ మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఆ టీ పౌడ‌ర్ అయిపోయే వ‌ర‌కే ఈ అవ‌కాశం. అందుకే, ఓ వెయ్యి రూపాయ‌లు మ‌న‌వి కావ‌నుకుంటే.. ఆ అద్భుత‌మైన రుచుండే.. క‌ప్పు టీ తాగేసి.. ఓ సెల్ఫీ దిగేసుకోండి. క‌ల‌కాలం గుర్తుండి పోతుంది ఆ మెమోరీ.. దానితో పాటు చాయ్ రుచీ. ఆ టీ తాగి.. వాహ్‌వా ఏమి రుచి.. అన‌రా మైమ‌ర‌చి...
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu