టెంపుల్స్ పై కరోనా పంజా.. ఒంటిమిట్ట రామాలయం మూసివేత

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆలయాలపైనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలు ఆలయాల్లో దర్శనాలు రద్దు చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు టీటీడీ, పురావస్తు అధికారుల సమక్షంలో ఆలయానికి నోటీస్‌ అంటించారు. మే  15 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు నోటీసులో తెలిపారు

కోదండరామాలయంతోపాటు కడప జిల్లాలోని మరో 15 ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయం మూసివేతతో ఈనెల 21నుంచి జరగాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత నెలకొంది. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కొవిడ్ ఎఫెక్టుతో ఈసారి ఉత్సవాలు సాదాసీదాగా జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే టీటీడీలో సర్వ దర్శనాలు రద్దు చేశారు.