వివేకా హత్య కేసులో సంచలన వివరాలు

"వివేకా మర్డర్ కేసు వివరాలు తన దగ్గర ఉన్నాయి. డీటేల్స్ ఇస్తానన్నా దర్యాప్తు అధికారులు స్పందించలేదు. స్వయంగా ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారు. వివేకా హత్య జరిగిన చాలా సేపటి వరకు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. పోలీసులను కొందరు ప్రజాప్రతినిధులు కావాలనే అడ్డుకున్నారు." ఇలా వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలతో ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. 

వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదని సీబీఐ డైరెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని దర్యాప్తు అధికారికి రెండు సార్లు తెలిపినా స్పందించలేదని లేఖలో వివరించారు. దర్యాప్తు అధికారి ఎన్‌కే సింగ్‌కు స్వయంగా ఫోన్‌ చేసి చెప్పినా పట్టించుకోలేదన్నారు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో తెలిపారు.

హత్య జరిగిన తర్వాత ఇల్లంతా కడిగేసి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే వరకు ఘటనా స్థలిని ఎంపీ అవినాష్‌రెడ్డి తన అదుపులో ఉంచుకున్నారని వెల్లడించారు. ఆసమయంలో మీడియా, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది, పోలీసులను కూడా అనుమతించలేదని తెలిపారు. మొత్తం సమాచారాన్ని అప్పటి దర్యాప్తు బృందానికి  నిఘా విభాగం అందజేసిందని ఏబీ లేఖలో వెల్లడించారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నానని, ఈ కారణంగానే తనను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తప్పించి ఉంటారని ఏబీ వెంకటేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు.