తెలంగాణలో కమల దళం పుంజుకోనుందా?

 

కాషాయ దళం ఏ పని చేసిన అందులో ఏదో ఒక వ్యూహం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష తో పలువురు నేతలను పార్టీలో చేర్చుకుంది. త్వరలోనే లోక్ సభ నియోజక వర్గాల వారీగా కొంతమంది బలమైన నేతలకు గాలం వెయ్యాలని లిస్ట్ ను సిద్ధం చేసుకుంది బీజేపీ. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు పార్టీ పునాదులు వేసేందుకు సరి కొత్త ప్లాన్ లు వేస్తున్నారు నేతలు.

ఆర్టీసీ కార్మిక సంఘాలలో పట్టు కోసం ఇప్పటికే బిజెపి నేతలు సమ్మెను ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. సమ్మె ప్రారంభమైనప్పట్నుంచి బిజెపి నేతలు ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా కదులుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో పాటు ఇతర పార్టీ నేతలు కార్మికులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కార్మిక సంఘాల్లో ఇప్పటి వరకు వామపక్షాలు లేదా టీఆర్ఎస్ కు పట్టుంది. దీంతో లెఫ్ట్ కు కార్మిక సంఘాలలో చెక్ పెట్టాలనేది బీజేపీ ఎత్తుగడగా తెలుస్తోంది. ఇప్పటికే సింగరేణి కార్మిక సంఘాల్లో కీలక నేత మల్లయ్యను పార్టీలో చేర్చుకుంది. అక్కడ పార్టీ కార్మిక సంఘాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెను అదనుగా తీసుకొని తమ కార్మిక సంఘాన్ని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సమ్మెను ఒక ఆయుధంగాబీజేపీ నేతలు వాడుకుంటున్నారని ఇతర పార్టీల నేతలు అనుమానిస్తున్నారు.

మొత్తానికి తెలంగాణలో విస్తరణ కోసం బీజేపీ పాచికను విసురుతోంది. అయితే ఇవన్నీ ఫలిస్తాయా లేదా అనేది ఎన్నికలు వస్తేగాని తెలీదు. ఆ ఎన్నికలు ఎప్పుడో ఐదేళ్ల తర్వాత ఉన్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చూపించిన ప్రభావం బట్టి ఆ పార్టీ ఎదుగుదల ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా.