డిఫ్యాక్టో సీఎం సజ్జలకు కౌంట్ డౌన్ మొదలయ్యిందా?

సజ్జల రామకృష్ణా రెడ్డి స్వతాహాగా రాజకీయ నాయకుడు కాదు.ఆయన ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు. ఆ పైన వ్యాపార భాగస్వామ్యాన్ని రాజకీయాలతో ముడివేసి రాజకీయ నాయకుడయ్యారు. అయితే  సజ్జల  జర్నలిస్ట్ జీవితాన్ని పక్కన పెడితే వ్యాపార, రాజకీయ ప్రయాణంలో ఆయన ప్రయాణమంతా  వైఎస్ కుటుంబంతో కలిసే సాగింది. ఇక రాజకీయ ప్రయాణం అయితే పూర్తిగా  జగన్ మోహన్ రెడ్డి తోనే   సాగి, సజ్జలయ ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు స్థాయికి ఎదిగారు.  

అంతవరకు అన్ని వ్యవహరాలలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిని   పక్కకు నెట్టి మరీ సజ్జల ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.  . నిజానికి ఆయన పేరుకే ముఖ్యమంత్రి సలహాదారు కానీ, వాస్తవంలో ఆయన ఇంటర్నల్ స్టేటస్ ఇంకా చాలాచాలా ఎక్కువని, అంటారు. అలాగే, సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్ది చెందిన సజ్జల  పార్టీ, ప్రభుత్వ రాజకీయాలపైనే కాకుండా  తాడేపల్లి ప్యాలెస్ రాజకీయాలపై కూడా పట్టు సాధించారనీ అందుకే, ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత ‘ముఖ్య’ నేతగా చక్రం తిప్పుతుండడమే కాకుండా ఒక విధంగా డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని  ఆయన అంటే గిట్టని పార్టీ నేతలు అంటారు.

అందుకే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ కీలక నేతలతో సహా చాలా మంది నాయకులు ఆయన పట్ల చాలా గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. 
అదలా ఉంటే ఇప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం నేపథ్యంలో అధికార వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వెనక సజ్జల హస్తం ఉందనే  అభియోగం బలంగా వినిపిస్తోంది. ఒక విధంగా సజ్జల ముఖ్యమంత్రి కళ్ళకు గంతలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. వైసీపీ ప్రస్తుతం ఎదుర్కుంటున సంక్షోభానికి సజ్జలే కారణం అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే కాకుండా, తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో   కూడా వినవస్తునట్లు చెబుతున్నారు.  

ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేశారనే ఆరోపణపై సస్పెన్షన్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు, సజ్జలనే దోషిగా నిలబెడుతున్నారు.  సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అన్నారం నారాయణ రెడ్డి అయితే తాము టీడీపీకి అమ్ముడు పోయామని సజ్జల చేసిన ఆరోపణపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సజ్జల ఎవరు? అయన చరిత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. అంతే కాదు, సజ్జలను వదిలే ప్రసక్తిలేదని, సస్పెన్షన్  గురైన ఇతర ఎమ్మెల్యేలతో చర్చించి, సజ్జలపై పరవు నష్టం దావా వేస్తామని  అన్నారు. అలాగే, ఆయన సజ్జల టార్గెట్’ గా తీవ్ర ఆరోపణలు చేశారు.  అలాగే  సస్పెన్షన్ వేటుకు గురైన మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి సజ్జల తనను హత్య చేయిస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు. సజ్జల వల్ల ప్రాణహాని ఉందన్న భయంతోనే హైదరాబాద్ లో తల దాచుకుంటున్నానన్నారు.  

నిజానికి, చాల కాలంగా సజ్జల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయనీ, అయితే ఎందుకనో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ ఫిర్యాదులను అంతగా పట్టించుకోలేదని అంటారు.  ముఖ్యంగా జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగకుండా చేయడంలో సజ్జల కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అదలా ఉంటే ఇంతకాలం సరైన  సమయం కోసం ఎదురు చూస్తున్న సజ్జల బాధితులంతా ఏకమయ్యేందుకు, తెర వెనక ప్రయత్నాలు మొదలయ్యాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఈ ప్రయత్నాల వెనక, జగన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ మిత్రులు, వైఎస్ కు సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే  జగన్ రెడ్డి కూడా కొంచెం ఆలస్యంగానే అయినా సజ్జల రాజకీయ ఎత్తులను పసిగట్టినట్లు తెలుస్తోంది. అందుకే, సజ్జల చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నారని, ఆదిశగా పావులు కదులుతున్నాయని అంటున్నారు.