తెలంగాణలో ఉధృతంగానే కరోనా.. టెస్టులను బట్టి బయట పడుతున్న కేసులు 

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం ప్రకటించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,012 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,139 మంది కోలుకుని డిశార్జ్ కాగా, 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,958కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో 19,568 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 50,814 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 576కి చేరింది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 532 కరోనా కేసులు నమోదు కాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 198, రంగారెడ్డిలో 188 కేసులు, వరంగల్ అర్బన్ లో 127, ఖమ్మం లో 97, సంగారెడ్డిలో 89 కేసులు నమోదయ్యాయి.

 

ఇదిలా ఉంటే తెలంగాణ‌లో టెస్టుల సంఖ్య‌ను బట్టి పాజిటివ్ కేసులు కూడా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మొన్న శని ఆదివారాలలో బక్రీద్ సందర్భంగా కొన్ని చోట్ల టెస్టులు చేయలేదు. దీంతో ఆ రెండు రోజులు పాజిటివ్ కేసులు తగ్గాయి. ఐతే తాజాగా 21 వేల‌కు పైగా టెస్టులు చేస్తే.. 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌పడ్డాయి. అంటే దాదాపుగా టెస్టుల సంఖ్య‌లో 10 శాతం బాధితులు ఉన్నట్లుగా తేలుతోంది. అయితే టెస్టులు కనుక పెంచితే పాజిటివ్ కేసులు సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.