హెల్త్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ లలో మోసాలు

TATA AIG GENERAL INSURANCE కంపెనీ వాళ్ళను నమ్మి మోసపోయానంటారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సి.హెచ్ శ్రీనివాస‌రావు. ఆ  కంపెనీ వాళ్ళు ప్రజల ఆరోగ్య అవసరాలతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ లో పాలసిదార్లు గా చేర్చుకునే టార్గెట్లు పూర్తి చేసుకునే వరకు అనేక రకాలు గా కబుర్లు చెప్పి చేర్చుకొని ప్రీమియం వసూలు చేసుకుంటారు.  ఆ తరువాత అదే పాలసీ హోల్డర్ ఆసుపత్రి పాలై చికిత్స తీసుకుంటే మాత్రం క్లెయిమ్ ల దగ్గరకి వచ్చేసరికి హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీల అసలు రంగు బయటపడుతుంది. క్లెయిమ్ లను ఎగ్గొట్టడానికి ఎన్నెన్ని రకాలుగా ఎత్తులు వేస్తారో చెపితే కొత్తగా లేని బీపీ, షుగర్ వ్యాధులు వస్తాయంటున్నారు శ్రీనివాస్.

ఇన్యూరెన్స్ కంపెనీ శ్రీనివాస్‌ను మోసం చేసిన తీరును ఆయ‌న వివ‌రించారు. నేను ఏప్రిల్ 19వ తేదీన గుండె పోటు కి గురయ్యి  సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరాను. అదే రోజున స్టంట్ వేశారు. ICCU నుంచి రూమ్ కు షిఫ్ట్ చేసిన తర్వాత మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంది కదా అని క్లెయిమ్ కోసం అక్కడే దరఖాస్తు చేసుకున్నాను. కిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కు అవసరమైన వివరాలు, రికార్డులన్నీ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి TATA AIG GENERAL INSURANCE కంపెనీ వాళ్ళు రంగంలో కి దిగారు. మొదటి కొర్రిగా బీపీ గురించి అడిగితే దానికి ఒక డాక్టర్ లెటర్ పంపారు. ఆ తర్వాత ఒక గంట సమయం తర్వాత మరో కొర్రి అడిగారు. ఈసారి షుగర్ గురించి. దానికీ మళ్ళీ ఒక సర్టిఫికెట్ పంపాము. మరో గంట సమయం తర్వాత మరో కోర్రి అడుగుతూ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఈసారి హైపర్ టెన్షన్ గురించి. మళ్లీ దానికి డాక్టర్ లెటర్ పంపారు. మరో గంట సమయం తర్వాత మళ్లీ కోర్రీ అడుగుతూ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. షుగర్ గురించి పాత రికార్డులు అడిగారు. ఏదో జోక్ చెప్పినట్లుగా... "ఆరు నెలల క్రితం బ్రతికి ఉన్నట్లు గా లెటర్ తీసుకురామట్లుగా'' అడిగారు. పాత ప్రెస్క్రిప్షన్లు ఎక్కడో పడిపోయి ఉంటాయిగా... ఇక దాన్నే పట్టుకున్నారు TATA AIG GENERAL INSURANCE కంపెనీ వాళ్ళు. ఇక సహనం నశించి ఆ కంపెనీ మేనేజర్ నరేష్ గారి నెంబరు ఎలా గోలా కనుక్కొని ఫోన్ చేసి నా బాధ, టెన్షన్ మొత్తం వివరించా. వాదోప వాదనలు పూర్తయిన తర్వాత ఆయన ఒక ఆథ‌రైజేషన్ లెటర్ ఇవ్వమన్నారు. అది కూడా ఇచ్చాను. ఆ తరవాత సోమవారం రాత్రి ( ఏప్రిల్ 22వ తేదీ)  TATA AIG GENERAL INSURANCE కంపెనీ నుంచి నర్సయ్య అనే వ్యక్తి హాస్పిటల్ లోనీ నా రూమ్ (A9006)కు వచ్చారు. నా ఫోటో, నాతో పాటు నా పక్కనున్న నా భార్య ఫోటో తీసుకున్నాడు. మళ్లీ అదే వ్యక్తీ పక్కనే ఉన్న రిసెప్షన్ లో నర్సుల దగ్గరకు వెళ్ళి మొత్తం నా రికార్డులన్నీ ఫొటోలు తీసుకున్నాడు. ఇన్స్పెక్షన్ కు వచ్చినట్లుగా నా నుంచి సంతకం కూడా తీసుకున్నాడు. ఈ మొత్తం తతంగమంతా రెండు రోజుల పాటు జరిగింది. ఇంతా చేస్తే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ ఇచ్చారా... అంటే అదీ లేదు... పాత రికార్డులు లేవని నా క్లెయిమ్ ను ఇవ్వకుండా తిరస్కరించారు. అంటే ఆరేళ్ళ క్రితం నేను బ్రతికి ఉన్నట్లుగా రికార్డులు ఇవ్వనందుకన్నమాట...ఇందులో ఏమైనా అర్థముందా?

నేను ఆసుపత్రిలో చేరింది గుండె పోటుతో... స్టంట్ వేశారు... దానికి చికిత్స చేశారు. బిల్లు కూడా అందుకే వేశారు... కొర్రీలు పేరుతో రెండు రోజుల పాటు వేధించారు... అయినా ఓపికగా డాక్యుమెంటరీ జవాబులు ఇచ్చాం. ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి ఇన్స్పెక్షన్ కు వచ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. బోగస్ క్లెయిమ్ కాదు నిజమైన క్లెయిమ్ యే నని నిర్ధారించుకున్నారు. అయినా పాత ప్రిస్క్రిప్షన్ లు ఇవ్వలేదని రిజెక్ట్ చేసారు. ఇలా ఒక సీనియర్ జర్నలిస్ట్ కే వేధింపులు తప్పలేదు... క్లెయిమ్ ఇవ్వలేదంటే ఇక మిగతా సామాన్య జనం పరిస్ఠితి ఎలా ఉంటుందో మ‌రి...

హెల్త్ ఇన్స్యూరెన్స్ పేరుతో ప్రీమియం లు వసూళ్ళకే పరిమితం అవుతూ క్లెయిమ్ ల విషయాలకు వచ్చేసరికి ఇలా వేధింపులకు గురి చేసి ఎగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్న TATA AIG GENERAL INSURANCE కంపెనీ వంటి సంస్థలపై, వాటి ఆగడాలకు చెక్ పెట్టేదెవ‌రు?

- ఎం.కె.ఫ‌జ‌ల్‌