శతాబ్దాల తర్వాత తిరిగి జన్మస్థలానికి...

యుగాలుగా పూజలందుకున్న పవిత్రప్రాంతం. యుగపురుషుడి జన్మస్థలం. ఇక్ష్యాక వంశమూలపురుషులచే నిర్మితమై హిందూ, బుద్ధ, జైన, ఇస్లాం మతాలకు ఆరాధ్య ప్రదేశం, అనేక వివాదాలను కేంద్రబిందువై ఎట్టకేలకు కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన రామయ్య కోవెల నిర్మాణానికి సిద్ధమైన పట్టణం అయోధ్య.. శతాబ్దాల తర్వాత రాముడు సర్వాంగసుందరంగా భక్తులకు దర్శనమించే మహిమాన్విత ప్రదేశంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. కోట్లాది మంది హిందువుల పవిత్రయాత్రాస్థలంగా రూపుదిద్దుకోనుంది.

 

హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు అవతరించిన ప్రదేశం అయోధ్య. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు అత్యంత మహిమాన్వితమైన చరిత్ర ఉన్న నగరం. రామాయణమహాకావ్యానికి ఆరంభం పలికిన అయోధ్యను సాకేతపురంగా కూడా పిలిచేవారు. సూర్యవంశ చక్రవర్తుల పాలనలోని కోసలరాజ్య రాజధానిగా ఈ నగరం వెలుగొందింది. స్కంధ పురాణంతో పాటు ఏడు మోక్షపురాణాల్లో అయోధ్య ప్రస్తావన ఉంది.

 

అధర్వణవేదంలో అయోధ్య దేవనిర్మితమని పేర్కొన్నారు. సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడు ఇక్ష్వాకుడు ఈ నగరాన్ని నిర్మించి కోసల రాజ్యాన్ని పరిపాలించాడని పురాణాల్లో ఉంది.

 

ఇక్ష్వాకవంశం 63వ రాజైన దశరథుడి తనయుడిగా శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ లో అయోధ్య వైభవం, రామరాజ్యం గొప్పతనం వర్ణించబడింది.

 

11వేల ఏండ్లు రాముని పాలనలో..
విష్ణుమూర్తి ఏడో అవతారమైన శ్రీరాముడు రావణసంహారణ అనంతరం ఇక్ష్వాక రాజ్యధినేతగా, సూర్యవంశవారసుడిగా దాదాపు 11వేల ఏండ్లు అయోధ్యను రాజధానిగా కోసల రాజ్యాన్ని పరిపాలించాడు అని పురాణాల్లో ఉంది.పురుషోత్తముడిగా, ఆదర్శపురుషుడిగా కీర్తించబడిన శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శతో పునీతమైన నేలగా అయోధ్య పట్టణానికి  గుర్తింపు ఉంది. జీవితంలో ఒకసారైనా రాముడు తిరుగాడిన ఈ నేలను తాకాలని హిందువులు తపిస్తారు. సత్యవాక్యపరిపాలకుడైన శ్రీరాముడు హిందువులకే కాదు అనేక మతాల వారికి ఆరాధ్యుడు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సందర్భంగా అమెరికా టైమ్స్ స్కైర్ లోనూ రామచంద్రమూర్తి దివ్యరూపాలతో దేదీప్యమానంగా వెలుగొందాయి. 

 

శతాబ్దాల తర్వాత
త్రేతాయుగం నుంచి కలియుగం వరకు పవిత్రప్రాంతంగానే అయోధ్య ఆరాధించబడింది. ముస్లీంల దండయాత్ర తర్వాత అనేక నగరాల రూపురేఖలు మారినట్టే అయోధ్య రూపు మార్చచే ప్రయత్నం జరిగింది. రాముడి మూలాలను చెరిపివేస్తూ బబ్రీమసీదు నిర్మాణం జరిగింది. అనేక దశాబ్దాల పాటు కోర్డులో వివాదాంశంగా కొనసాగి చివరికి  రామమందిర నిర్మాణానికి  గత ఏడాది నవంబర్ 9న సుప్రీంకోర్డు అనుమతి లభించింది.

 

కోట్లాది హిందువుల కల
రామజన్మభూమిలో రామమందిర నిర్మాణం కోట్లాది మంది కల. అసేతు హిమాచలం పులకించేలా ఈ రోజు రామ మందిరానికి భూమి పూజ జరుగుతుంది.