న‌గ‌రిలో రోజా ఓట‌మి లాంఛ‌న‌మే?!

ఏపీలో ఎన్నిక‌ల వేళ న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్య‌ర్థి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఎదురౌతున్న వ్యతిరేకత, నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి.  రెండు సార్లు వ‌రుస‌గా విజ‌యం సాధించిన ఆమె.. మూడోసారి విజ‌యంతో హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని ఆశపడుతున్నారు.  అయితే నియోజ‌క‌వ‌ర్గంలో రోజాకు ప్ర‌జ‌ల నుంచేకాక సొంత పార్టీ నేత‌ల నుంచి నిర‌స‌న సెగ ఎదుర‌వుతుండటంతో ఆమె ఆశ అడియాస కాకతప్పదన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. రోజా వ‌ద్దు.. కూట‌మి అభ్య‌ర్థి ముద్దు అంటూ నియోజ‌క‌వ‌ర్గంలోని మెజార్టీ వైసీపీ నేత‌లు నిన‌దిస్తున్నారు. ఇప్ప‌టికే స‌ర్వేల‌న్నీ రోజా ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చిచెప్పాయి. రోజాకు ఈ పరిస్థితి ఎదురుకావడానికి ఆమె స్వయంకృతాపరాథమే కారణమని పార్టీ వర్గాలు అంటున్నారు. అలవిమాలిన   అహంకారంతోనే రోజాకు ఈ పరిస్థితి వచ్చిందని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. 

గ‌త ఐదేళ్ల కాలంలో రోజా నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి చేయ‌క‌పోగా.. త‌న సోద‌రులు, భ‌ర్త స‌హ‌కారంతో ఓ అవినీతి అన‌కొండ‌లా మారార‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గం  ప్ర‌జ‌లుసైతం రోజా ప్ర‌చారాన్ని అడ్డుకుంటూ ఆమెను అడుగ‌డుగునా నిల‌దీస్తున్నారు. తాజాగా వ‌డ‌మారిపేట మండ‌లం వేమ‌పురం గ్రామ‌స్తులు రోజాను అడ్డుకున్నారు. ఐదేళ్లు అధికారంలోకి ఉండి కూడా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేద‌ని, ఎన్నిక‌లు రాగానే ఓట్లు అడ‌గ‌డానికి ఎలా వ‌స్తార‌ని రోజాను నిల‌దీశారు. రోజా ప్ర‌చార వాహ‌నాన్ని అడ్డుకున్నారు.  మ‌రోవైపు రోజా తీరుపై కొంత‌కాలంగా తీవ్ర ఆగ్ర‌హంతోఉన్న ఐదు మండ‌లాల వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల స‌మ‌యంలో రోజాకు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు రెడీ అయ్యారు.

న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిగా మ‌రోసారి రోజా పోటీ చేస్తుండ‌గా.. కూట‌మి అభ్య‌ర్థిగా గాలి భాను ప్రకాష్ బ‌రిలో నిలిచారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా భాను ప్ర‌కాష్ కు గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అందుకు రోజాకు అడుగ‌డునా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ స‌మ‌స్య‌ల‌పై రోజాను నిల‌దీస్తున్నారు. ఐదేళ్ల కాలంలో ఏ స‌మ‌స్య‌నూ ప‌రిష్క‌రించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రోజా ఓట‌మి ఖాయ‌మ‌ని భావిస్తున్నవేళ‌.. మూలిగే న‌క్క‌పై తాడిపండు ప‌డిన చందంగా,  ఆమెకు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. మంత్రి రోజాపై సొంత పార్టీ నేతలే రివర్స్ అయ్యారు. ఆమెను ఓడించి తీరుతామ‌ని చాలెంజ్ చేశారు. గ‌త ఎన్నికల్లో విజ‌యం త‌రువాత రోజా నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి అన‌కొండ‌లా మారార‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా ఆమెకు క‌ప్పం క‌ట్టాల్సిందేన‌ని వారు ఆరోపిస్తున్నారు.

అవినీతిలో ఆరితేరిన రోజాకు మ‌రోసారి టికెట్ ఇవ్వొద్ద‌ని గ‌త కొంత‌కాలంగా వైసీపీ అధిష్టానంపై నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు మండ‌లాల నేత‌లు ఒత్తిడి తెచ్చిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రోజాకే మ‌రోసారి టికెట్ కేటాయించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో నైనా రోజాలో మార్పు వ‌స్తుంద‌ని భావించి ఇంత కాలం ఊరుకున్నామనీ, అయితే ఆమె తీరు మారకపోవడంతో  కీలక నిర్ణయం తీసుకున్నామనీ చెబుతు న్నారు. ఆ కీలక నిర్ణయం ఏమిటంటే  ఐదు మండలాల వైసీపీ కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేసేశారు. తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు.  దీంతో రోజాకు బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. రోజాకు ఫుల్ సపోర్టుగా ఉండాల్సిన  నేతలు వైసీపీని వీడుతుండటంతో రోజా ఓట‌మి లాంఛ‌న‌మేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

  శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి, లక్ష్మీపతిరాజు, ఆరుగురు సర్పంచ్ లు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు వైసీపీకి శుక్రవారం( మే3)  రాజీనామా చేశారు. రోజాకు టికెట్ ఇస్తే ఓడిపోతారని  ఎంతగా చెప్పినా వైసీపీ అధిష్టానం  పెడచెవిన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మొదలియార్ వర్గానికి చెందిన నాయకుడు, మాజీ ఎంపీపీ ఏలుమలై వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన పుత్తూరు, నగరిలో పర్యటించి మంత్రి అవినీతి, అక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. ఆయన వెంటఉన్న క్షత్రియ సామాజికవర్గ నాయకులు సైతం ఏకతాటిపైకి వచ్చి రోజాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో రోజా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు కూడా రెండు లక్షల నుంచి ఐదు లక్షలు వరకు తీసుకున్నారని, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచికూడా 10 శాతం కమిషన్ తీసుకున్నారని, బదిలీకైనా, అప్రూవల్ కయినా డబ్బులు ఇవ్వాల్సిందేనని రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్నికల వేళ నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా వైసీపీలోని ఓ వర్గంతోపాటు.. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతుండటంతో ఆమె ఓటమి ఖాయమని వైసీపీ అధిష్టానంసైతం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు రోజాపై మంత్రి పెద్దిరెడ్డి వర్గంకూడా గుర్రుగా ఉంది. రోజాకు ఎన్నికల్లో గట్టిషాక్ ఇచ్చేందుకు వారుకూడా సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి ఇన్నాళ్లు అహంకారంతో ప్రతిపక్ష పార్టీల నేతలపై ఇష్టారీతిలో మాట్లాడిన రోజాకు ఎన్నికల్లో ప్రజల నుంచి పరాభవం తప్పదని అంటున్నారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలతోపాటు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై రోజా చేసిన, చేస్తున్న వ్యాఖ్యలపట్ల నియోజకవర్గంలోని మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. మహిళ అన్న విషయం మరచి నోటికి ఎంతవస్తే అంత మాట్లాడటం సరికాదని, ఆమెకు ఎన్నికల్లో సరియైన గుణపాఠం చెబుతామనీ నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు పేర్కొంటున్నారు. గమనార్హం. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో సర్వేలు చెప్పినట్లు నగరి నియోజకవర్గంలో రోజా చీటీ చిరగడం ఖాయమన్నభావనే రాజకీయవర్గాల్లో, ప్రజలలో చివరాఖరికి వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతోంది.