రాయల తెలంగాణా వెనుక కాంగ్రెస్ అంతర్యం ఏమిటి?
posted on Jul 29, 2013 9:26AM
.jpg)
రాష్ట్ర విభజన దాదాపు ఖరారయినట్లే కనిపిస్తోంది. బహుశః అదే నిజమయితే, యుపీఏ ప్రభుత్వం తన నాలుగేళ్ల పాలనలో తీసుకొంటున్న అత్యంత సాహసోపేతమయిన నిర్ణయమవుతుంది. అయితే, తెలంగాణా, రాయల తెలంగాణాలలో కాంగ్రెస్ దేనిని ఎంచుకొంటుంది? అనే దానిపై కాంగ్రెస్ అంతర్యం బయటపడుతుంది. ఒకవేళ రాయల తెలంగాణావైపు మొగ్గు చూపినట్లయినతే, కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయకుండా సాగదీసేందుకే ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చును. అటు తెలంగాణా, ఇటు రాయలసీమ ప్రజలు, నేతలు ముక్త కంఠంతో వ్యతిరేఖిస్తున్నఈ ప్రతిపాదనతో కాంగ్రెస్ చర్చలు, సమావేశాలు పేరిట రాష్ట్ర విభజనపై మరికొంత వెసులుబాటు పొందడం కోసమే ఈ ఎత్తుగడ వేస్తున్నట్లు భావించవచ్చును.
ఇటువంటి ప్రతిపాదన తేవడంద్వారా తెలంగాణా నేతలలో భయాలు పెంచి చివరికి, తెలంగాణా ఇస్తే చాలు, రాజధాని తదితర క్లిష్టమయిన అంశాలపై ఎటువంటి షరతులకయినా వారు అంగీకరించే స్థాయికి తీసుకురావడం కూడా కాంగ్రెస్ ఉద్దేశ్యంగా కనబడుతోంది. బహుశః ఈ ప్రతిపాదనపైకి వచ్చిన తరువాతనే, తెలంగాణా నేతలు, హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా అంగీకరించేందుకు మానసికంగా సిద్దపడినట్లు తెలుస్తోంది.
అయితే, సీమంధ్ర నేతలు కోరుతున్నట్లు హైదరాబాద్ ను పరిమిత కాలం వరకయినా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గిన కాంగ్రెస్, ఆ విధంగా చేయాలంటే తెలంగాణా నేతలని ఈ విషయంలో మరికొంత ఒప్పించక తప్పదు. కానీ వారు అటువంటి ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేఖిస్తున్నారు. అందువల్ల వారిని లొంగదీయాలంటే రాయల తెలంగాణా వంటి అసంబద్ద ప్రతిపాదనే శరణ్యం. అటువంటి దానికి అంగీకరించి భవిష్యత్తులో మరో కొత్త సమస్యను ఎదుర్కోవడం కంటే, హైదరాబాదును పరిమిత కాలంవరకు కేంద్రపాలిత ప్రాంతంగా ఉమ్మడి రాజధానిగా అంగీకరించడానికే వారు మొగ్గు చూపే అవకాశం ఉంది. బహుశః అందుకే కాంగ్రెస్ ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన చేస్తున్నట్లు కనబడుతోంది.
ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన రాష్ట్ర విభజన చేయకుండా మరికొంత కాలం సమయం పొందేందుకు లేదా రాజధాని విషయంలో తెలంగాణా నేతలను ఒప్పించేందుకే కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసి ఉండవచ్చును.