రాహుల్ అసమర్థతే నాయకత్వ మార్పుకి ఆలోచనకి ప్రేరణ

 

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే సోనియా తపనే కాంగ్రెస్ కొంప ముంచిందని జానాభిప్రాయమే కాదు కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం కూడా. అందుకే మాజీ కేంద్రమంత్రి చిదంబరం భవిష్యత్తులో గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలు చేప్పట్టవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నుండే సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని పార్టీలో నేతలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. బహుశః అందుకే రాహుల్ గాంధీ పార్లమెంటులో పార్టీకి నాయకత్వం వహించకుండా వెనుక బెంచీలలో కునికిపాట్లు తీస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కనీసం మెలకువగా ఉన్న సమయంలో సైతం ఆయన పార్టీకి పునర్వైభవం సాధించేందుకు చేసిన కృషి ఏమీలేదు. పైగా ఈ మధ్యనే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. అందువల్ల ఇప్పుడు ఆయన భవిష్యత్తే కాదు పార్టీ భవిష్యత్తు కూడా అంతా అంధకారంగా కనబడుతోంది.

 

అధికారంలో ఉన్నపుడే పార్టీని గెలిపించుకోలేని ఆయన, ఇక ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో పార్టీని ఏవిధంగా గెలిపించగలరు? అసలు అంతవరకు పార్టీని ఏక త్రాటిపై నడిపించే సత్తా అయినా ఆయనకు ఉందా? అనే అనుమానం కాంగ్రెస్ నేతలకు కలగడం సహజం.

 

ప్రధాని నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న నాయకత్వ లక్షణాలు, దైర్యం, తెగువ, జోరు చూసి యావత్ దేశమే కాదు అమెరికా, జపాన్ వంటి ఇతర దేశాలు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నప్పుడు, అసలు నాయకత్వ లక్షణాలే లేని రాహుల్ గాంధీ పార్టీకి ఏవిధంగా నాయకత్వం వహించగలరు? అవే ఉండి ఉంటే పదేళ్ళ క్రితమే పార్టీ పగ్గాలు చేజిక్కించుకొని, ప్రధాన మంత్రి పదవిలో స్థిరపడి ఉండేవారు కదా? అటువంటి వ్యక్తి చేతిలో పార్టీని పెడితే, పార్టీనే నమ్ముకొన్న కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఏమయిపొతారు? అనే ప్రశ్న కాంగ్రెస్ జనాలకి కలిగినందునే బహుశః చిదంబరం నోట ఆణిముత్యాల వంటి ఈ పలుకులు వెలువడి ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చును. బహుశః ఆయనిచ్చిన ఈ ప్రేరణతో త్వరలో మరికొంత మంది సీనియర్లు గొంతు కలిపితే, తల్లీకొడుకులకు కష్టకాలం మొదలయినట్లే భావించవచ్చును.

 

వచ్చే ఏడాది జూన్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవికి ఎన్నికలు జరుగుతాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వం గురించి ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు మరో 5-10 ఏళ్ళపాటు పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం బొత్తిగా కనబడటం లేదు కనుక, బహుశః ఈ సారి అధ్యక్ష పదవికి చాలా మందే పోటీ పడవచ్చును. వారిలో చిదంబరం కూడా ఒకరయినా ఆశ్చర్యం లేదు.