అఖిలపక్షంతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడం సాధ్యమేనా

 

కేంద్రం మళ్ళీ అఖిలపక్ష సమావేశం అంటూ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు మరో మారు అగ్ని పరీక్ష పెట్టి, తనపై వస్తున్న నిందలను తొలగించుకొంటూనే, ప్రతిపక్షాలపైకి వాటిని నెట్టేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్ర విభజనను పర్యవేక్షిస్తున్నకేంద్రమంత్రుల బృందం వద్దకు వెళ్లి సూచనలు, సలహాలు చెప్పి రావడమంటేనే విభజనకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లవుతుందని భావిస్తూ అన్నిరాజకీయ పార్టీలు వెనకడుగు వేస్తున్నఈ సమయంలో, అవ్వ పేరే ముసలమ్మ అన్నట్లు మళ్ళీ ఇప్పుడు విభజన కోసం మార్గదర్శకాలను చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి రమ్మంటూ ఆహ్వానించడం కూడా ప్రతిపక్షాలను ఇరికించాలనే ప్రయత్నమే.

 

అందువల్ల ఈ విభజన చదరంగంలో తెలివిగా పావులు కదుపుతున్న తెదేపా, వైకాపాలు ఈ అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవచ్చును. మజ్లిస్ మరియు లెఫ్ట్ పార్టీలు తప్ప తెరాసతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు ఇటువంటి తరుణంలో సమావేశం నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఎవరి కారణాలు వారికి ఉన్నపటికీ ఇప్పుడు ఈ సమావేశం అవసరం లేదనే విషయంలో దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

 

కానీ, ఎవరు వచ్చినా రాకపోయినా కేంద్రం మాత్రం సమావేశం నిర్వహించడం ఖాయం. ఎందుకంటే తెదేపా, వైకాపా నేతలు మరికొందరు వ్యక్తులు విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేస్తుండటం, ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణలు, తమ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి లేఖాస్త్రాలు సందిస్తూ, ప్రజల ముందు కాంగ్రెస్ అధిష్టానాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తుండటం వంటి అన్ని ఇబ్బందికర అంశాలను లెక్కలోకి తీసుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, ముల్లును ముల్లుతోనే తీయలన్నట్లు అఖిలపక్ష సమావేశంతోనే స్వపక్ష, ప్రతిపక్షాలను కట్టడిచేయవచ్చని ఈ ఎత్తు వేసింది. అయితే వాళ్ళు సమావేశానికి వచ్చినా రాకున్నావాళ్ళని ఏదోవిధంగా దోషులుగా నిరూపించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం గనుక సమావేశం ఖచ్చితంగా నిర్వహిస్తుంది. తద్వారా రేపు సుప్రీం కోర్టు కేంద్రం నుండి సంజాయిషీ కోరినప్పుడు, కోర్టుకి ఈ అఖిలపక్షం ద్వారా తాము చేసిన ప్రయత్నాలను వివరించి ప్రతిపక్షాల ద్వంద వైఖరిని, వ్యవహార శైలి గురించి చెప్పడానికి కూడా అవకాశం దొరుకుతుంది.

 

అయితే కాంగ్రెస్ దేశముదురయితే ప్రతిపక్షాలు కూడా మాహా ముదుర్లే గనుక దీనినుండి ఏవిధంగా బయటపడాలో వాళ్ళకి కూడా బాగా తెలుసు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu