నామినేటెడ్ రగడ!
posted on Jan 30, 2012 8:33AM
హైదరాబాద్: ఎంతోకాలంగా కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్న నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలన్న విషయం కాంగ్రెస్‌లో వివాదాస్పదమవుతోంది. నామినేటెడ్‌ల పంపకం సర్కారును కాపాడుకునే విధంగా ఉండాలా? లేక పార్టీని పటిష్టం చేసుకునే విధంగా ఉండాలా? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎన్నికల్లో టిక్కెట్టు ఆశించి భంగపడ్డవారికి, పార్టీకోసం కష్టపడి పని చేస్తున్న వారికి నామినేటెడ్ పదవులు ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో తగినంత బలం లేకపోవడం, వివిధ కారణాల వల్ల ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చోటుచేసుకోవడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు నామినేటెడ్ పదవుల్ని ఎమ్మెల్యేలకే కట్టబెట్టాలని అధిష్ఠానం ఆదేశించినట్టు చెబుతున్నారు. దీంతో పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో టిక్కెట్లు, గెలిచిన తర్వాత నామినేటెడ్ పదవుల్ని వారికే కట్టబెడితే పార్టీకోసం పని చేస్తున్న మాకు ఒరిగేదేమిటి? అన్నది నేతల ప్రశ్న. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం సమంజసమే అని కొందరు అంటుండగా, పార్టీ పటిష్టం కావాలంటే పార్టీకోసం పని చేస్తున్న వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్న నమ్మకాన్ని నామినేటెడ్ పదవులతో కలిగించాలని మరికొందరు అంటున్నారు.
నామినేటెడ్ పదవుల్ని ఎమ్మెల్యేలకు కాకుండా పార్టీ నేతలకే ఇవ్వాలన్న వాదనకు కాంగ్రెస్ పార్టీలో బలం చేకూరుతోంది.త్వరలోనే ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండేళ్ళలోగానే అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీని పటిష్టం చేయడానికి పని చేస్తే తమకు గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం కుదిరితేనే కిందిస్థాయిలో నేతలు ఉత్సాహంగా పని చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అత్యంత కీలక సమయంలో నామినేటెడ్ పదవుల్ని ఎమ్మెల్యేలకు కట్టబెడితే పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు ఎలా పని చేస్తారని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దాదాపు నలభై వరకు వివిధ కార్పొరేషన్లు ఉండగా వాటిలో డైరెక్టర్లుగా ఐదు వందల మందికిపైగా అవకాశం లభిస్తుంది. చైర్మన్ పదవుల్ని ఎమ్మెల్యేలకు ఇచ్చి డైరెక్టర్ పదవుల్ని పార్టీ నేతలకు ఇచ్చే దిశగా నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఇలాఉండగా, నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కసరత్తు చేపట్టారు. మొత్తం కార్పొరేషన్లకు పాలక వర్గాలను ఒకటేసారి నియమించకుండా, దశలవారీ నియమించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. మొదటి విడత నియామకాల తర్వాత పార్టీ నాయకుల్లో, వివిధ సామాజిక వర్గాల్లో వచ్చే స్పందన ఆధారంగా రెండోవిడత నియామకాల్లో లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, నామినేటెడ్ పదవుల నియామకంలో కూడా కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం నేతలు వాటా అడుగుతున్నారు. ఇందుకు కాంగ్రెస్ నాయకత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇది కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంది.