తెరమీదకు మళ్ళీ ప్రత్యేక హోదా.. ఈసారైనా ఓకేనా?

ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో కేంద్ర సర్కార్ ఇచ్చిన హామీ మేరకే వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక  హోదానే శరణ్యమనే వాదన రాష్ట్ర ప్రజల నుంచి వినిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలను ఆ రాష్ట్ర నేతలు ముమ్మరం చేశారు..

అయితే ప్రత్యేక హోదా అనగానే ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినదని అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులే కాలేసినట్టే. కేంద్రానికి జీ హూజూర్ అంటున్న జగన్ రెడ్డి సర్కార్ ప్రత్యేక హోదా పై మాట్లాడే ధైర్యం చేస్తుండని ఊహించడం కూడా ఆశగానే మిగిలిపోతుంది. తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది బీహార్ లో. 

బీహార్  వివరాలోకి వెళ్ళే ముందు.. ఊరించి ఉసురుమనిపించిన ఏపీ హోదా వివరాల్లోకి వెళితే...రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ పెద్దల సభ సాక్షిగా ఇచ్చిన హామీ, 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏడుకొండల వెంకన్న సాక్షిగా, ఇప్పటి ప్రదాని  నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ,  ఇంత  వరకు నెరవేరలేదు. ఇక  ముందు నెరవేరుతుందన్న ఆశ లేదు. నిజానికి  ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో చేతులు ఎత్తేసింది. అధికార పార్టీ ఆ ఊసే ఎత్తదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే హోదా పైన శ్రద్ద లేదు. ప్రతిపక్ష నేతగా అధికారం కోసం చేసిన పాదయాత్ర పొడవునా ఆయన వైసీపీకి రాష్ట్రంలో అధికారం, లోక్ సభలో 25 కు 25 స్థానాలు ఇస్తే ప్రత్యేక  హోదా పట్టుకోస్తామని ప్రగల్బాలు పలికారు. అయన మాటలు నమ్మి ప్రజలు  ఎన్నికలలో వైసీపీని  భారీ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్ర శాసనసభలో 151/175 సీట్లు, లోక్ సభలో 22/25 సీట్లు కట్ట బెట్టారు. 

కానీ, మాట తప్పం ..మడమ తిప్పం అది మా వంశంలోనే లేదని ఊదర కొట్టిన జగన్ రెడ్డి, ఫలితాలు పూర్తిగా రాకముందే మాట తప్పారు మడమ తిప్పారు’  కేంద్రంలో బీజేపీ/ఎన్డీఎకి భారీ  మెజారిటీ వచ్చింది, కాబట్టి ప్రత్యేక హోదా  విషయంలో ఇక మనం ఏమి చేయలేం, ఏదో కేంద్రాన్ని అడుగుతూ ఉండడమే కానీ, ఇంకేమీ చేయలేమని చేతులు ఎత్తేశారు.పోనీ ఆ అడగడం అన్నా చేశారా? అంటే అదీ లేదు. అడిగితె మోడీ, అమిత్ షా  ఎక్కడ అగ్రహిస్తారో, అక్రమాస్తుల కేసుల్లో ఎక్కడ అడుగు ముందుకేస్తారో అన్న భయంతో అడగడటమే మానేశారు. అందుకే, ప్రజలు కూడా జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ప్రత్యేక హోదాను మరిచి పోవడమే మంచిందన్న నిర్ణయానికి వచ్చారు. 

బీహార్ రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా, ఇప్పుడు మళ్ళీ ఆ రాష్ట్రంలో కాకరేపుతోంది. నీతి అయోగ్ ఇటీవల విడుదల చేసిన, ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యం’ (సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్) (ఎస్దీజీ) సూచి చిచ్చురేపింది. ఈ సూచిలో బీహార్, బీమార్ స్టేట్’గానే మిగిలి పోయింది. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జాబితాలో పైన నిలిస్తే, బీహార్ వందకు 52 పాయింట్లతో అట్టడుగుకు చేరింది. దీంతో విపక్షాలు ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నాయి. పదేళ్ళ ఎన్డీఎ పాలనలో రాష్ట్రం  అద్వాన్న స్థితికి చేరిందని దుయ్యపడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 

మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పట్టుపడుతున్న జేడీయూ నాయకుడు ఉపేంద్ర కుశ్వాహ, ఇప్పటికైనా, ఎప్పుడో ఇస్తామన్న ప్రత్యేక హోదా గురించి పునరాలోచించాలని, ప్రధానిని కోరుతూ ట్వీట్ చేసి, ప్రధాని నరేంద్ర మోడీని ట్యాగ్ చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం చేయగలిగింది చేసినా, ఆశించిన అభివృద్ధి అందని దాక్షగానే మిగిలి పోయిందని, సో ... ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం వనరులు పుష్కలంగా ఉన్న ఝార్ఖండ్ ప్రాంతాన్ని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతో అవశేష బీహార్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకు పోయిందని, కుశ్వాహ చెప్పారు. 

ఇక ఇప్పుడు మళ్ళీ మనం ఏపీ విషయానికి వస్తే, బీహార్ పరిస్థితే ఏపీలోనూ ఉంది,అన్ని హంగులు, వనరులు ఉన్న హైదరాబాద్ నగరం అటు తెలంగాణకు వెళ్లిపోవడంతో, 13 జిల్లాల అవశేష ఆంధ్ర ప్రదేశ్ అనాధగా మిగిలింది. అయినా, బీహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్, జనతా దళ్ (యు)ఎన్డీఎలో భాస్వామ్య పక్షంగా ఉండి కూడా ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్నారు. కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం హోదా ఉసేత్తెందుకే భయపడుతున్నారు. ఇప్పటికైనా బీహార్’ ను ఆదర్శంగా తీసుకుని కేంద్రం పై వత్తిడితేవాలని ఆంధ్రులు కోరుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu