రానున్న ఎన్నికల్లో సిపీఐ, సిపియం చెరోవైపు?
posted on Dec 19, 2012 2:12PM
.png)
వచ్చే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎవరికీ అంతుబట్టని విధంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు! గత ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి 'మహాకూటమి'గా ఏర్పడి పోటీ చేసిన సిపీఐ, సిపియం పార్టీలు ప్రస్తుతం చెరోవైపు నడవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతమున్న సమాచారాన్ని బట్టి, సిపీఐ పార్టీ తెలుగుదేశం, టి.ఆర్.ఎస్.లతోను, సిపియం పార్టీ జగన్ పార్టీతోనూ జతకట్టనున్నాయని తెలుస్తోంది. ఈ నెల 28న ఢిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం, జగన్ పార్టీలు వ్యక్తం చేసే వైఖరిపైనే ఈ సమీకరణాలు కొలిక్కి వస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఒకవేళ, తెలుగుదేశం సమైక్యాంధ్ర వైఖరి అవలంభిస్తే మాత్రం ఒక్క టి.ఆర్.ఎస్.తోనే పొత్తు పెట్టుకోవాలనేది సిపీఐ వ్యూహంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కామ్రెడ్ల వైఖరి ఏమిటో తెలియాలంటే మాత్రం తెలంగాణా అఖిలపక్షం ముగిసేవరకూ వేచి చూడాల్సిందే!