కాంగ్రెస్ లో ఒంటరయిన ముఖ్యమంత్రి

 

ఏ కార్యక్రమమయినా సాదాసీదాగా జరిగితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ కి సంబందించినది మాత్రం కాదని చెప్పవచ్చును. అది కాంగ్రెస్ సమావేశం అయినా, పధకం అయినా నియామకం అయినా ఎంతో కొంత రాజకీయం తప్పని సరి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ హస్తం’, ‘ఇందిరమ్మ కలలు’, ‘బంగారు తల్లి’ పధకాలను ఈ రోజు మెదక్ జిల్లా సంగారెడ్డిలో ప్రారంభించనున్నతరుణంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమాలకి మొహం చాటేసి విదేశాలకు వెళ్ళిపోయారు. ముఖ్య మంత్రి తనకు ఏమాత్రం విలువ ఈయడం లేదని ఆయన అలిగారు. కానీ, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునితా రెడ్డి మాత్రం వారిరువురి మద్య ఎటువంటి విభేదాలు లేవవి ఒక సర్టిఫికేట్ జారీచేసారు.

 

ఇక, మొన్న కరీంనగర్ లో జరిగిన మరో సభలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణా విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని, తెలంగాణా రాష్ట్రం కోసం కేంద్రాన్ని ఒప్పించవలసిన బాధ్యత తీసుకోవాలని సభాముఖంగా కోరిన తరువాత ‘జై తెలంగాణా!’ అంటూ నినాదాలు చేసారు. దానితో వేదిక మీదున్న కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం అసహనం ప్రకటిస్తూ తెలంగాణా అంశం కేంద్రం పరిధిలో ఉందని కేంద్రం ఏ నిర్ణయం తీసుకొన్నా దానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రకటించవలసి వచ్చింది.

 

ఒకవైపు ఎంతో ఆర్భాటంగా ఆయన తన పధకాలను ప్రచారం చేసుకొని ప్రజలలో తన ప్రతిష్ట పెంచుకోవాలని ఆయన ప్రయత్నిస్తుంటే, అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం, దానితో తమకేమి సంబంధం లేదన్నట్లు ఆయన క్యాబినెట్ మంత్రులే ప్రవర్తించడం విశేషం. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రితో ఆయనకున్న విబేదాలు తరచూ బయట పడుతూనే ఉన్నాయి.

 

ఇక రాష్ట్ర మంత్రి వర్గం, శాసన సభ్యులలో సగం మంది తెలంగాణా కారణంగా ఆయనను వెలివేస్తే, వివిధ కారణాలతో డా.రవీంద్రా రెడ్డి, వీ.హనుమంత రావు, చిరంజీవి, రామచంద్రయ్య వంటివారు అనేక మంది ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఇక, మాజీ మంత్రి శంకర్ రావు అయితే తీవ్ర విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి పరిస్థితి చూస్తే ఆయనకు కేవలం అధిష్టానం మద్దతు ఉండనే ఏకైక కారణంతోనే మిగిలిన వారందరూ ఆయనని బలవంతంగా భరిస్తున్నట్లు ఉంది తప్ప, ఆయనతో కలిసి పనిచేసే ఆసక్తి ఎవరికీ ఉన్నట్లు కనబడటం లేదు. అందుకు ఆయననే తప్పుపట్టాల్సి ఉంటుంది.

 

పార్టీలో, ప్రభుత్వంలో అందరిని కలుపుకుపోవలసిన పార్టీలో ఒంటరివాడుగా తిరుగుతున్నారు. కానీ పార్టీలో, ప్రభుత్వంలో తనను ఎంతమంది వ్యతిరేఖిస్తున్నా ఆయన మాత్రం తన పద్దతిలో ముందుకు సాగిపోతున్నారు. మరి, ఇటువంటి నేపద్యంలో ఆయన సారద్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కొంటుందో, ఏవిధంగా గెలుస్తుందో కాలమే చెప్పాలి.