రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్!.. డ్ర‌గ్స్, గంజాయిపై కేసీఆర్‌ ఫోకస్..

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ దందాపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గ‌ళ‌మెత్తారు. వైట్ ఛాలెంజ్ పేరుతో డ్ర‌గ్స్‌పై అటెన్ష‌న్ క్రియేట్ చేశారు. గంజాయి దందాపైనా ప్ర‌భుత్వాన్ని నిల‌దీసి అడిగారు. స్కూళ్లు, కాలేజీ ప్రాంగ‌ణాల్లో గంజాయి అమ్ముతుంటే కేసీఆర్ కంటికి క‌నిపించ‌డం లేదా? అంటూ ప్ర‌శ్నించారు. రేవంత్‌రెడ్డి విమ‌ర్శ‌ల‌తో వెంట‌నే రంగంలోకి దిగితే ఆ క్రెడిట్ ఆయ‌న ఖాతాలో ప‌డుతుంద‌నుకున్నారో ఏమో.. కాస్త టైం తీసుకొని.. తాజాగా డ్ర‌గ్స్‌, గంజాయి దందాపై పోలీస్‌, ఎక్సైజ్ శాఖ‌ల అధికారుల‌తో సీఎం కేసీఆర్ కీల‌క స‌మీక్ష నిర్వహించారు. తెలంగాణ‌లో డ్ర‌గ్స్ వినియోగం, గంజాయి దందాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి ఆదేశించారు. 

గంజాయిపై యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని, గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 

యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి.. వాట్సాప్ ద్వారా మెసెజ్‌లు పంపించుకొని.. గంజాయి సేవిస్తున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాల‌న్నారు కేసీఆర్‌. 
గంజాయి నిరోధించడానికి వెంట‌నే డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ ను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను బలోపేతం చేయాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. బార్డర్లలో చెక్ పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. 

ఇంటలిజెన్స్ శాఖలో ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రత్యేక ప్రమోషన్లు లాంటి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.