బండి యాత్ర లేన‌ట్టేనా? హైక‌మాండ్ వ‌ద్దందా? సీనియ‌ర్లు చెక్ పెట్టారా?

ఆగ‌స్టు 9న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని భాగ్య‌ల‌క్ష్మి టెంపుల్ నుంచి హుజురాబాద్ వ‌ర‌కూ మొద‌టి విడ‌త పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు బండి. ఢిల్లీ పెద్ద‌ల అనుమ‌తి తీసుకున్నారో లేదో.. సీనియ‌ర్ల‌తో చ‌ర్చించారో లేదో కానీ.. పాద‌యాత్ర షెడ్యూల్‌, రూట్‌మ్యాప్ అయితే రెడీ అయిపోయింది. ఆగ‌స్టు 9 కోసం బండి సంజ‌య్ వెయిటింగ్‌. అంత‌లోనే అధ్య‌క్షుల వారికి ఢిల్లీ నుంచి షాకింగ్ న్యూస్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. పాద‌యాత్ర లేదు.. పాడూలేదు.. పార్ల‌మెంట్ సెష‌న్‌కు ఆసాంతం అటెండ్ కావాలంటూ ఎంపీ బండి సంజ‌య్‌ని ఆదేశించింద‌ట హైక‌మాండ్‌. ఆగ‌స్టు 13న వానాకాల స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ ఢిల్లీలోనే అందుబాటులో ఉండాల‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. 

ఆగ‌స్టు 13 వ‌ర‌కూ అంటే.. ఆగ‌స్టు 9న ప్రారంభ‌మ‌య్యే పాద‌యాత్ర లేన‌ట్టేనా? అనే సందేశాలు వ్య‌క్తం అవుతున్నాయి. లేన‌ట్టే.. అంటున్నాయి బీజేపీ వ‌ర్గాలు. ఎందుకు లేన‌ట్టు? అని ప్ర‌శ్న‌. అందుకు అదే కార‌ణ‌మా? వారే పుల్ల‌ పెట్టారా? అనే అనుమానం. అట్నుంచి అవున‌నే స‌మాధానం. ఇలా బీజేపీలోనూ కాంగ్రెస్ త‌ర‌హా రాజ‌కీయం రంజుగా సాగుతోంది. 

ఆగ‌స్టు 9 నుంచి పాద‌యాత్ర అని ఘ‌నంగా ప్ర‌క‌టించారు బండి సంజ‌య్‌. ఆ రోజు తెలీదా పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉంటాయ‌ని? అంత తెలీకుండా ఉంటారా? ఆగ‌స్టు 8న క్విట్ ఇండియా డే కాబ‌ట్టి.. ఆ మ‌ర్నాటి నుంచి పాద‌యాత్ర ప్ర‌క‌టించారో లేక‌, ఆ రోజు మంచి రోజ‌ని అనుకున్నారో కానీ, డేట్ అయితే ఫిక్స్ చేసేశారు. మ‌రి, అందుకు అధిష్టానం అనుమ‌తి తీసుకున్నారా? లేదా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. బీజేపీలో ఇలాంటి పాద‌యాత్ర‌ల క‌ల్చ‌ర్ లేదు. ఆ రోజుల్లో అద్వానీ ర‌థ‌యాత్ర మిన‌హా.. ఆ త‌ర్వాత‌ క‌మ‌ల‌నాథులు ఇలాంటి యాత్ర‌ల జోలికి పోయింది లేదు. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. బీజేపీ సైద్ధాంతిక ప్రాతిప‌దిక‌న న‌డిచే పార్టీ. పార్టీ సిద్దాంతాల ఆధారంగానే ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందాలి కానీ, వ్య‌క్తుల ఇమేజ్‌తో కాద‌ని బ‌లంగా న‌మ్ముతుంది. ఒక్క మోదీ విష‌యంలో మాత్రం ఆ ప్రిన్సిపుల్‌ను ప‌క్క‌న పెట్టేసింద‌నుకోండి అది వేరే విష‌యం. సో, ఆ లెక్క‌న‌.. బండి సంజ‌య్ పాద‌యాత్ర చేప‌డితే.. పార్టీకంటే ఆయ‌న‌కే ఎక్కువ ప్ర‌చారం, పాపులారిటీ వ‌స్తుంద‌ని.. ఇది పార్టీ ప్రాథ‌మిక సిద్ధాంతానికి విరుద్ధ‌మ‌ని అంటున్నారు. ఇదే పాయింట్ మీద సీనియ‌ర్లు పార్టీ పెద్ద‌ల ద‌గ్గ‌ర కొర్రీ పెట్టార‌ని అంటున్నారు. 

ఇప్ప‌టికే టీబీజేపీలో వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరింది. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి- రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ల మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డుస్తోంద‌ని చెబుతారు. ఈట‌ల విష‌యంలో అది మ‌రింత తారాస్థాయికి చేరింద‌ని.. ఈట‌లకు కిష‌న్‌రెడ్డి స‌పోర్ట్ చేస్తుండ‌గా.. బండి అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు.  ఇప్ప‌టికే హుజురాబాద్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ పాద‌యాత్ర నిర్వ‌హిస్తుండ‌గా.. బండి సంజ‌య్ చార్మినార్ నుంచి హుజురాబాద్‌కు పాద‌యాత్ర చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌నేది సీనియ‌ర్ల ప్ర‌శ్న‌. వేరే జిల్లాల మీదుగా పాద‌యాత్ర చేస్తే.. హుజురాబాద్‌లో ఈట‌ల‌కు ఎలా లాభిస్తుంద‌నే లాజిక్కును లాగుతున్నారు. ఇదంతా కిష‌న్‌రెడ్డి, ఈట‌ల‌కు పోటీగా.. బండి సంజ‌య్ త‌న పాపులారిటీ పెంచుకునే ప్ర‌య‌త్నంలో భాగంగానే.. పాద‌యాత్ర‌ను ప్ర‌క‌టించారంటూ అధిష్టానానికి కొంద‌రు సీనియ‌ర్లు ఫిర్యాదు చేశార‌ని అంటున్నారు. ఆ సీనియ‌ర్ల ఒత్తిడి మేర‌కే.. బండి సంజ‌య్‌ను పార్ల‌మెంట్ సెష‌న్ ముగిసే వ‌ర‌కూ ఢిల్లీలోనే ఉండాల‌ని పార్టీ ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. అదే నిజ‌మైతే.. ఆగ‌స్టు 9న బండి చేప‌ట్ట‌బోయే పాద‌యాత్ర లేన‌ట్టేనా? వాయిదా ప‌డుతుందా? మొత్తానికే ర‌ద్దు అవుతుందా? వారం రోజుల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అప్ప‌టి వ‌ర‌కూ.. ఇలాంటి గుస‌గుస‌లే....