అన్యాయం జరిగితే సహించను... అధికారులకు జగన్ హెచ్చరిక...

ఫిబ్రవరి ఒకటి నుంచి 21లోపు కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులను డోర్ డెలివరీ చేయాలంటూ అధికారులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఫిబ్రవరి 15కల్లా ఇళ్ల పట్టాల లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. పది రూపాయల స్టాంపు పేపర్ల మీద మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు  ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏదో మొక్కుబడిగా ఇవ్వకుండా, నివాసయోగ్యమైన ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలను కేటాయించి... ఉగాదినాడు లబ్దిదారుల్లో సంతోషం నింపాలని జగన్మోహన్‌రెడ్డి సూచించారు. అలాగే, ఫిబ్రవరి 15నుంచి ఆరోగ్యకార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఫిబ్రవరి ఒకటి నుంచి వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత చేపడతామన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇకపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించనున్నట్లు జగన్ తెలిపారు. 

అదేవిధంగా ఫిబ్రవరి 28న 3వేల 300 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ-వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తున్నామని, అయితే 336 సర్వీసులు 72గంటల్లోనే పూర్తిచేసి తీరాలని సూచించారు. ఇక, ఫిబ్రవరి 28నుంచి దాదాపు 11లక్షల మందికి విద్యావసతి దీవెన అమలు చేయబోతున్నట్లు తెలిపిన జగన్... మధ్యాహ్నం భోజనం నాణ‌్యత విషయంలో రాజీ పడొద్దని కలెక్టర్లకు ఆజ్ఞాపించారు. ఆర్డీవోలు, కలెక్టర్లు మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షిస్తూ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఇక, ఫిబ్రవరి చివరి నాటికి దాదాపు అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ విధానం అమలు కావాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... అన్ని చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రజలందరి ముఖాల్లో సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్హులైనవారందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నారు. తాను గ్రామాల్లో పర్యటించినప్పుడు అర్హుల జాబితాను కచ్చితంగా తనిఖీ చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించబోనని హెచ్చరించారు.