టీఆర్ఎస్ లోకి సాయన్న.. కేసీఆర్ పై చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉండేవారో అందరికి తెలిసిన విషయమే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదేమో అన్న పరిస్థితి ఉండేది. ఏదో ఒక వివాదం గురించి ఇద్దరూ ఎప్పుడూ ఆరోపించుకోవడమే సరిపోయేది. వీరి మధ్యలో గవర్నర్ కూడా కొంత కాలం నలిగిపోయారు. అయితే ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం పుణ్యమా అని వారిద్దరి మధ్య ఉన్నవిబేధాలు చాలా వరకూ తగ్గాయి. ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవడం తగ్గిపోయింది. అందుకు వరంగల్ ఉపఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అన్ని పార్టీలను తన మాటలతో ఏకిపారేశారు కానీ చంద్రబాబుపై ఒక్క విమర్శకూడా చేయకపోవడం నిదర్శనం. ఇక చంద్రబాబు కూడా కేసీఆర్ గురించి ఎక్కడా విమర్శించేలా మాట్లాడటం లేదు.

అయితే ఇప్పుడు జరిగిన తాజా పరిణామాలు చూస్తుంటే ఇద్దరు సీఎంలు ఇంతకుముందు ఉన్నట్టే ఉంటారా.. లేక పాత ధోరణిలోకే వస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణలో స్థానిక, గ్రేటర్ ఎన్నికలు షురూ అయిన వేళ టీఆర్ఎస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. అప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్నను తమ పార్టీలోకి చేర్చుకుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు అని అందరి సందేహం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇద్దరు సీఎంల మధ్య స్నేహ బంధం ఏర్పడుతుంది. మరి ఇలాంటి తరుణంలో ఎప్పటి నుండో టీడీపీని అంటిపెట్టుకున్న సాయన్నను తన పార్టీలోకి చేర్చుకున్న కేసీఆర్ పట్ల చంద్రబాబు ఇప్పుడు ఎలా ఉంటారో అని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. సాయన్న చేరికతో ఇద్దరిమధ్య మళ్లీ విబేధాలు తలెత్తుతాయేమో అని అనుకుంటున్నారు. లేకపోతే అవేమి పట్టించుకోకుండా ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారేమో అని అనుకునే వారు కూడా ఉన్నారు. మరి అందరి సందేహాలు తీరాలంటే ఈ విషయంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu