కుప్పంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు
posted on Jul 2, 2025 5:33PM
.webp)
ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంపై వరాల జల్లు కురిపించారు. ఇవాళ ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కుప్పం నియోజకవర్గం తుమ్మిసిలో నిర్వహించిన సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వర్ణ కుప్పంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.1617 కోట్లతో కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని సీఎం తెలిపారు. హంద్రీనీవా ద్వారా శ్రీశైలం నుంచి కుప్పానికి సాగునీళ్ల అందిస్తామని హామీ ఇచ్చారు.
కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తామని, రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతేకాదు ఎలక్ట్రిక్ ఆటోలు, బస్సు నడిచేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం పట్టణ రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు .కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో సుపరిపాలన అందించే దిశగా ప్రయత్నం చేశామని చంద్రబాబు వెల్లడించారు. ఈవీ బస్సులు, ఆటోలు, ఇంటింటికీ సౌర విద్యుత్ తీసుకువస్తామని సీఎం తెలిపారు